శ్రీలంకలో భారత్‌ దిగ్విజయ యాత్ర విశేషాలు మీ కోసం

శ్రీలంకలో భారత్‌ దిగ్విజయ యాత్ర విశేషాలు మీ కోసం

మూడు ఫార్మాట్లు… ఆటగాళ్లు మారారు… వేదికలు మారాయి… కానీ ఫలితం మాత్రం మారనే లేదు. శ్రీలంక గడ్డపై భారత జట్టు దిగ్విజయ యాత్ర పూర్తయింది. ఆడిన తొమ్మిది అంతర్జాతీయ మ్యాచ్‌లలోనూ అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా సంపూర్ణ విజయాన్ని సాధించింది. తిరుగులేని ఆటతో ప్రత్యర్థిని చెడుగుడు ఆడుకున్న టీమిండియా సగర్వంగా పర్యటన ముగించింది. సొంతగడ్డపై కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేని అశక్తతతో, అవమాన భారంతో ఆతిథ్య శ్రీలంక ఖాతాలో అతి పెద్ద శూన్యం చేరింది.

171 పరుగుల విజయలక్ష్యం… 42 పరుగులకు 2 వికెట్లు పడ్డాయి. అయితే ఎప్పటిలాగే తనదైన శైలిలో వేటగాడు విరాట్‌ కోహ్లి ఆడుతూ పాడుతూ ఫినిషింగ్‌ లైన్‌ దిశగా జట్టును నడిపించాడు. అతనికి మనీశ్‌ పాండే అండగా నిలవడంతో భారత్‌ ఏ దశలోనూ ఆందోళన చెందాల్సిన అవసరమే రాలేదు. మూడో వికెట్‌కు వీరిద్దరు 119 పరుగులు జోడించడంతో జట్టుకు సునాయాస గెలుపు దక్కింది. 48 రోజుల లంక టూర్‌ అమితానందంతో ముగిసింది. ముఖ్యంగా ఈ పర్యటన మాజీ కెప్టెన్‌ ధోనికి తీపి జ్ఞాపకాలు మిగిల్చింది. ఈ సిరీస్‌ మొత్తంలో ధోని ఒక్కసారి కూడా అవుట్‌ కాకపోవడం విశేషం.

విరాట్‌ కోహ్లి నాయకత్వంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనను చిరస్మరణీయంగా మార్చుకుంది. టెస్టు, వన్డే సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసిన జట్టు పొట్టి క్రికెట్‌లోనూ తమ పదును చూపించింది. బుధవారం ఇక్కడ జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. దిల్షాన్‌ మునవీరా (29 బంతుల్లో 53; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, అషాన్‌ ప్రియాంజన్‌ (40 బంతుల్లో 40 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. చహల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్‌ 19.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విరాట్‌ కోహ్లి (54 బంతుల్లో 82; 7 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగిపోగా… మనీశ్‌ పాండే (36 బంతుల్లో 51 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో అతనికి సహకరించాడు. తాజా విజయంతో మూడు ఫార్మాట్‌లలో కలిపి భారత్‌ 9–0 తేడాతో లంకను ఓడించినట్లయింది.

కోహ్లి జోరు

పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో మరో మైలురాయిని అందుకున్నాడు. వేగంగా 15 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తం 304 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడి (మూడు ఫార్మాట్‌లలో కలిపి) అతడు ఈ ఘనత సాధించాడు. వరల్డ్‌ క్రికెట్‌లో 15 వేల పరుగులు పూర్తి 33వ ఆటగాడిగా కోహ్లి గుర్తింపు పొందాడు. అయితే 50పైగా సగటుతో ఈ రికార్డు సాధించిన బ్యాట్స్‌మన్‌ అతడొక్కడే కావడం విశేషం.

బుధవారం శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌లో ఈ ‘ఛేజింగ్‌ స్టార్‌’ 54 బంతుల్లో 82 పరుగులు చేశాడు. కెరీర్‌లో 50వ టి20 మ్యాచ్‌ ఆడిన కోహ్లి… ఛేదనలోనే అత్యధిక పరుగులు (1,016)  చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మెకల్లమ్‌ (1,006) రికార్డును అధిగమించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో కోహ్లి(1830) మూడో స్థానంలో ఉన్నాడు. మెకల్లమ్‌(2140), తిలకరత్నే దిల్షాన్‌(1889) అతడి కంటే ముందున్నారు. టీమిండియా కెప్టెన్‌ జోరు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని రికార్డులు అతడి ఖాతాలో చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.