ధోనీ ఫామ్ వెనుక దాగిన రహస్యం అదేనా?

ధోనీ ఫామ్ వెనుక దాగిన రహస్యం అదేనా?

బెంగళూరు: చాంపియన్స్ ట్రోఫీ వరకు ఉన్న ధోనీ వేరు.. ఇప్పుడు కనిపిస్తున్న ధోనీ వేరు. అది అతని అభిమానులు కూడా అంగీకరించే విషయమే. చాంపియన్స్ ట్రోఫీ వరకు అతని పరిస్థితి దారుణంగా ఉంది. వన్డే, టీ20ల్లోనూ కెప్టెన్సీ పోయి.. టీమ్‌కు భారంగా మారుతూ ఇక రిటైర్మెంటే మిగిలింది అన్నట్లు ధోనీ పరిస్థితి తయారైంది. అయితే సడెన్‌గా శ్రీలంక టూర్ నుంచి మనకు ఆ పాత ధోనీయే కొత్తగా కనిపిస్తున్నాడు. బ్యాట్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. వికెట్ల వెనుక మెరుపులా కదులుతున్నాడు. శ్రీలంక సిరీస్‌లో రెండు వన్డేల్లో టీమ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. తాజాగా ఆస్ట్రేలియాతో తొలి వన్డేలోనూ అలాంటి పర్ఫార్మెన్సే రిపీట్ చేశాడు. అతని ఫామ్ చూసి కోచ్ రవిశాస్త్రి కూడా ఇక అతను 2019 వరల్డ్‌కప్ ఆడటం ఖాయమని తేల్చేశాడు. అయితే సడెన్‌గా అతనిలో ఈ మార్పునకు కారణం ఏంటి? ఇప్పుడొస్తున్న వార్తలే నిజమైతే.. ధోనీ తన క్రికెట్ గేర్‌ను మార్చడమే అతని ఫామ్‌లో మార్పునకు కారణమని తెలుస్తున్నది. వినడానికి వింతగా ఉన్నా అదే నిజం.

ధోనీ తన కెరీర్ అంతా మొరాంట్ ప్యాడ్స్‌ను వాడాడు. మిగతా ప్యాడ్లతో పోలిస్తే ఇవి తేలిగ్గా ఉంటాయి. దీనివల్ల క్రీజులో ఈజీగా కదిలే అవకాశం బ్యాట్స్‌మన్‌కు ఉంటుంది. అలాంటి ప్యాడ్స్‌ను ధోనీ పక్కన పెట్టేశాడు.

ప్రస్తుతం కొత్త ప్యాడ్స్‌తో అతను బ్యాటింగ్‌కు దిగుతున్నాడు. నిజానికి క్రికెటర్లంతా కెరీర్ ముగింపునకు వస్తుంటే బరువున్న ప్యాడ్స్‌ను పక్కన పెట్టి తేలిగ్గా ఉన్నవాటి వైపు మొగ్గు చూపుతారు. కానీ ధోనీ ఏది చేసినా వెరైటీ కదా. తేలిగ్గా ఉన్న మొరాంట్ ప్యాడ్స్‌ను కాదని సాంప్రదాయ ప్యాడ్స్ వైపు మళ్లాడు.

పైనున్న ఫొటోలో అంతకు ముందు వాడుతున్న, ఇప్పుడు వాడుతున్న ప్యాడ్స్ మధ్య తేడా స్పష్టంగా చూడొచ్చు. బ్యాటింగ్‌లోనే కాదు స్టంప్స్ వెనుక కూడా ధోనీ మెరుపు వేగంతో కదులుతున్నాడు. ఈ మధ్యే స్టంపింగ్స్ రికార్డును కూడా అతను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే.