అనుష్కలో అదొక్కటే నచ్చదు..: ‘చీకూ’ అదే మన కోహ్లీ

అనుష్కలో అదొక్కటే నచ్చదు..: ‘చీకూ’ అదే మన కోహ్లీ

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మలో తనకు నచ్చే, నచ్చని విషయాలను వెల్లడించాడు. ఓ హిందీ టీవీ ఛానెల్‌ దీపావళిని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌, విరాట్‌ కోహ్లీతో చాట్‌ షో నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా కోహ్లీ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ షోని దీపావళి సందర్భంగా ప్రసారం చేయనున్నట్లు సమాచారం.


కార్యక్రమంలో భాగంగా ఆమిర్‌.. కోహ్లీని కొన్ని ప్రశ్నలు వేశాడు. ఈ క్రమంలో అనుష్కలో మీకు నచ్చేవి.. నచ్చని అంశాలు ఏమిటి అని అడిగాడు. ఇందుకు కోహ్లీ బదులిస్తూ.. ‘తన నిజాయతీ, జాగ్రత్తగా చూసుకునే స్వభావం ఎంతో నచ్చుతాయి. ఇక నచ్చనిది అంటే సమయపాలన. ఎప్పుడూ చెప్పిన సమయానికి రాదు. కొంచెం ఆలస్యంగా వస్తుంది. కొంచమే కాబట్టి ఎప్పుడూ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.’ అని చెప్పాడు.

అనంతరం ‘చీకూ’ అనే ముద్దుపేరు ఎలా వచ్చిందని ఆమిర్‌ అడగ్గా.. ‘అండర్‌-17 క్రికెట్‌ ఆడే సమయంలో నా చెవులు చాలా పెద్దగా కనిపించేవి. పొడవాటి జట్టుతో వాటిని కప్పి ఉంచేవాడిని. నా హెయిర్‌ స్టైల్‌ చూసి మిగతా ఆటగాళ్లు ‘చీకూ రాబిట్‌’ అంటూ పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ధోనీ కూడా అలాగే పిలవడం ప్రారంభించాడు. ఒకసారి స్టంప్స్‌ వెనుక ఉన్న ధోనీ నన్ను చీకూ అని పిలవడం మైక్‌లో రికార్డయ్యింది. అలా ఆ పేరు ప్రచారంలోకి వచ్చింది.’ అని కోహ్లీ చెప్పాడు.

ఆమిర్‌ ఖాన్‌ నటించిన వాటిలో ఇష్టమైన సినిమాలు ఏమిటని అడగ్గా.. ‘జో జీతా వహి సికిందర్‌’, ‘త్రీఇడియట్స్‌’, ‘పీకే’ అని కోహ్లీ సమాధానమిచ్చాడు. వెంటనే ఆమిర్‌ నవ్వుతూ.. అవునవును.. నీకు ‘పీకే’ ఇష్టమని నాకు తెలుసు. ఎందుకంటే అందులో అనుష్క నటించింది కదా. కార్యక్రమం చివర్లో ఆమిర్‌-కోహ్లీ పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. ‘దంగల్‌’ సినిమా కోసం ఫస్ట్‌ క్లాప్‌ కొట్టిన క్లాపర్‌ను ఆమిర్‌ కోహ్లీకి ఇవ్వగా.. కోహ్లీ తాను ధరించిన టీమిండియా జెర్సీని ఆమిర్‌కు కానుకగా ఇచ్చాడు.