అతి వేగానికి బ్రేక్‌

అతి వేగానికి బ్రేక్‌

  • స్పీడ్‌గన్‌ల స్థానంలో వీఎంఎస్‌ పరికరాలు
  • ధర తక్కువ.. పనితీరూ మెరుగు
  • ప్రయోగాత్మకంగా గచ్చిబౌలి, ఔటర్‌లో పరిశీలన
  • రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదన

రోడ్ల మీద వాహనాన్ని వాయువేగంతో నడపడాన్ని మీరు ఆస్వాదిస్తారా? అయితే జాగ్రత్త సుమా! ప్రమాదాల బారిన పడే మాట అటుంచితే తొలుత మీ జేబుకు భారీగా చిల్లులు పడొచ్చు. అంతకంతకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో మితిమీరిన వేగంతో ప్రయాణించే వారిని గుర్తించి కొరడా ఝుళిపించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకుగాను ప్రస్తుతం వినియోగిస్తున్న లేజర్‌ స్పీడ్‌ గన్స్‌ స్థానంలో వీఎంఎస్‌ అనే వినూత్న పరికరాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఔటర్‌ రింగురోడ్డుపై ఈ పరికరం పనితీరును డీజీపీ (రోడ్డు భద్రత) కృష్ణప్రసాద్‌ గురువారం పరిశీలించారు.

సోలార్‌ పవర్‌తో నడిచే వీఎంఎస్‌ పరికరం రోడ్డుపై వెళ్లే వాహనం వేగాన్ని గుర్తించి ఎల్‌ఈడీ తెరపై ప్రదర్శిస్తుంది.

ఈ మేరకు సెంట్రల్‌ సర్వర్‌తో వీఎంఎస్ ను అనుసంధానిస్తారు. నిర్దేశించిన పరిమితికి మించి వేగంతో దూసుకెళ్లే వాహనదారులను గుర్తించి ఆన్‌లైన్‌ పద్ధతిలో జరిమానా విధిస్తారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ఐదువందల ప్రాంతాలను గుర్తించి, అక్కడ వీఎంఎస్‌ పరికరాలను అమర్చాలని రోడ్డు భద్రతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీఎంఎస్‌ పరికరాల పనితీరు సంతృప్తికరంగా ఉందని ప్రభుత్వ ఆమోదం మేరకు త్వరలో వీటిని వాడుకలోకి తేనున్నట్లు డీజీపీ కృష్ణప్రసాద్‌ తెలిపారు. లేజర్‌ స్పీడ్‌ గన్‌లు ఒక్కోక్కటి రూ. 10 లక్షలు ఉండగా వీఎంఎస్‌ పరికరం అతి తక్కువ ధరకే లభిస్తుండటం, పనితీరు మెరుగ్గా ఉండడంతో వీటిని వినియోగించేందుకు అధికారులు ఆసక్తి కనబరుస్తున్నారు.