హిట్‌ సినిమాల్ని వదిలేశారు!

హిట్‌ సినిమాల్ని వదిలేశారు!

ఏ పుట్టలో ఏ పాముందో ఎవ్వరూ చెప్పలేరు. చిత్రసీమలోనూ అంతే. ఏ కథ ఎప్పుడు, ఎందుకు వర్కవుట్‌ అవుతుందో వూహించలేం. కొన్ని కథలు ‘తప్పకుండా హిట్‌ అవుతాయి’ అనుకొని ‘ఓకే’ చేస్తారు. కానీ అవే ఫ్లాప్‌ అవుతాయి. ఇంకొన్ని భయపడుతూ, భయపడుతూ తీస్తారు. అవే కాసులు కురిపిస్తాయి. ఈ అనుభవం ఈ మధ్యకాలంలో యువ కథానాయకులు అఖిల్‌, శర్వానంద్‌ ఇద్దరికీ ఎదురైంది. శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మహానుభావుడు’. ఈ దసరాకి విడుదలై మంచి టాక్‌ సంపాదించుకొంది. వసూళ్లూ రాబట్టుకొంది. అయితే ఈ కథని మారుతి ముందుగా అఖిల్‌కి వినిపించార్ట. అయితే అఖిల్‌ అప్పటికే విక్రమ్‌ కె.కుమార్‌ కథని ఓకే చేసి ఉండడం వల్ల.. మారుతి కొన్నాళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందని, అందుకే ఈ కథని శర్వాతో పట్టాలెక్కించారని తెలుస్తోంది.

అఖిల్‌ వదిలేసిన కథని పట్టేసి, ఓ హిట్‌ కొట్టేసిన శర్వా కూడా ఓ సూపర్‌ హిట్‌ని చేచేతులా వదులుకొన్నాడు. అదే…

‘అర్జున్‌రెడ్డి’. వంగా సందీప్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర సంచలనం సృష్టించింది. రూ.4 కోట్లతో తెరకెక్కిస్తే, రూ.40 కోట్లు రాబట్టి ట్రేడ్‌ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. నిజానికి ఈ కథలో తొలుత అనుకొన్న హీరో శర్వానే.

”ఈ కథ ముందు నా దగ్గరకే వచ్చింది. కొంతమంది నిర్మాతలకూ వినిపించాం. వాళ్లు ధైర్యం చేయలేదు. సందీప్‌ నిర్మాతగా వ్యవహరిస్తారంటే నేనే వద్దన్నాను.

ఓ దర్శకుడు కథపై, సినిమాపై ఏకాగ్రత చూపించాలి. తనే నిర్మాతగా మారితే ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అందుకే ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. ‘అర్జున్‌రెడ్డి’ చూశాక ఓ మంచి సినిమాని వదులుకొన్నా అనే బాధ కలిగింది.

అయితే.. ఈ కథకు విజయ్‌ దేవరకొండనే సరైన కథానాయకుడు. ఆ పాత్రలో తాను అద్భుతంగా నటించాడ”న్నారు శర్వానంద్‌.