కూకట్‌పల్లిలో దారుణం

కూకట్‌పల్లిలో దారుణం

డిగ్రీ విద్యార్థిని దారుణంగా హత్యకు గురికావడం కూకట్‌పల్లి ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతోంది. సౌమ్య అనే 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని కృష్ణయ్య అనే వ్యక్తి శుక్రవారం దారుణంగా హతమార్చాడు. సౌమ్యను బైక్‌పై జీడిమెట్లలోని చింతల్‌ అడవుల్లోకి తీసుకెళ్లిన కృష్ణయ్య.. అక్కడ ఆమె గొంతునులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని  సంచిలో మూటగట్టుకొని.. బైక్‌పై తీసుకొచ్చి.. కూకట్‌పల్లి ఐడీఎల్‌ చెరువులో పడేశాడు.

ఐడీపీఎల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో సౌమ్య డిగ్రీ ఫస్టియర్‌ చదువుతోంది. సౌమ్యతో కృష్ణయ్యకు ఇటీవలే నిశితార్థం జరిగింది. కాలేజీలో చదువుతున్న సౌమ్య మరొకరితో చనువుగా ఉంటుందన్న అనుమానంతో కోపం పెంచుకున్న కృష్ణయ్య ఈ ఘాతుకానికి తెగబడ్డాడని సమాచారం. సౌమ్యను హత్య చేసిన అనంతరం అతను నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ప్రస్తుతం ఐడీఎల్‌ చెరువులో ఉన్న సౌమ్య మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొన్న మియాపూర్‌లో ఇంటర్‌ విద్యార్థిని హత్య నేపథ్యంలో తాజాగా విద్యార్థిని సౌమ్య హత్య నగరంలో కలకలం రేపుతోంది.