రేపే విజయవాడలో వైసీపీ ఆఫీస్ ఓపెనింగ్..!

రేపే విజయవాడలో వైసీపీ ఆఫీస్ ఓపెనింగ్..!

రాష్ట్రం విడిపోయి మూడేళ్లు దాటిపోయినా వైసీపీ మాత్రం ఇంకా పరాయి రాష్ట్రం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే సొంతరాష్ట్రంలో అడుగు పెట్టనివాళ్లు ప్రజలకు ఏం మేలు చేస్తారు.. అంటూ ఆ పార్టీపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకు వైసీపీ విజయవాడలో ఆఫీస్ ఓపెన్ చేయబోతోంది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో వైసీపీ తన నూతన తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభిస్తోంది. విభజన జరిగి మూడేళ్లు గడుస్తున్నా పార్టీ కార్యాలయం హైదరాబాద్ లోనే ఉంది.లోటస్ పాండ్ నుంచే ఆ పార్టీ వ్యవహారాలన్నీ సాగుతున్నాయి. అయితే ప్రశాంత్ కిశోర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కార్యాలయాన్ని అమరావతికి షిఫ్ట్ చేయాలని తేల్చిచెప్పారు. ప్రజలకు దగ్గరగా ఉండాలని, హైదరాబాద్ లో ఉండి ఏం చేసినా అది ప్రజలకు రీచ్ కాదని స్పష్టం చేశారు.

ప్రశాంత్ కిశోర్ సూచనతో ఆఘమేఘాల మీద జగన్ అండ్ టీం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తాడేపల్లి ప్రాంతంలో శాశ్వత కార్యాలయం, నివాసం కోసం జగన్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇది పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటివరకూ కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి కాకుండా అమరావతి నుంచే చేపట్టాలని నిర్ణయించారు. పైగా త్వరలోనే జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది.

పాదయాత్రకు సంబంధించిన వ్యవహారాలన్నింటిని మానిటర్ చేసేందుకు కూడా ఇక్కడ కార్యాలయం అవసరమని అధిష్టానం భావించింది. దీంతో.. విజయవాడలోని బందరు రోడ్డులో తాత్కాలిక కార్యాలయాన్ని సిద్ధం చేశారు. సోమవారం ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి జగన్ రావడం లేదు. కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన నేతలు మాత్రమే హాజరవుతున్నారు.

తాత్కాలిక కార్యాలయంలో జగన్ కోసం ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేశారు. పార్టీ ముఖ్యనేతల సమావేశానికి మరో ఛాంబర్ ఉంది. 200 మంది కూర్చుని సమావేశం నిర్వహించేందుకు వీలుగా పెద్ద హాలును ఏర్పాటు చేశారు. వైసీపీ ఆఫీస్ రాకతో అన్ని పార్టీల కార్యాలయాలూ అమరావతికి వచ్చినట్లవుతోంది. ఇకపై ఇక్కడి నుంచి పార్టీ కార్యకలాపాలన్నీ నడుస్తాయని పార్టీ నేతలు తెలిపారు.