జనసేనలో టిక్కెట్ల రగడ…

జనసేనలో టిక్కెట్ల రగడ…

మనదేశంలో ఎన్ని కొత్త రాజకీయ పార్టీలు వచ్చినా కొత్త సీసాలో పాత సారాలా ఎప్పుడూ అదే రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉంటున్నారు. పార్టీ మారినా నాయకులు మాత్రం వాళ్లే ఉంటున్నారు. ఈ మూస విధానానికి చెక్ పెడతానని నొక్కి చెప్పిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సైతం ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నారా ? అంటే తాజా పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి.

 

2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించడంతో జనసేన అభిమానులు, జనసేన కార్యకర్తలు టిక్కెట్లపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ తమకు బలం ఉన్న 175 నియోజకవర్గాల్లోనే పోటీ చేస్తామని చెప్పి పెద్ద షాక్ ఇచ్చారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లోను తమ పార్టీ బరిలో ఉంటుందని, తాము కూడా ఎమ్మెల్యేలుగా అదృష్టం పరీక్షించుకోవచ్చని భావించిన జనసేన నాయకులు, కార్యకర్తలకు పవన్ ప్రకటన పెద్ద షాక్ ఇచ్చింది.

ఈ షాక్ ఇలా ఉండగానే ఇప్పుడు వీరి నెత్తిన మరో పిడుగు పడేలా ఉంది. రాబోయే ఎన్నికల్లో జనసేన 40 శాతం పాతవారికి 60 శాతం కొత్త వారికి టికెట్లు ఇచ్చే ఫార్ములా తో పోటీ చేస్తుందని ఆ పార్టీ ప్రతినిధి హరిప్రసాద్ విజయవాడలో స్పష్టం చేయడం విశేషం. ఈ వ్యాఖ్యలను బట్టి జనసేనలో పూర్తిస్థాయిలో కొత్త రక్తం వస్తుందని ఆశించడం అత్యాసగానే కనిపిస్తోంది. అందరూ కొత్తవారికే టిక్కెట్లు ఇస్తే ఎన్నికల్లో పోల్, బూత్ మేనేజ్ మెంట్ సమస్యలతో సీట్లు తగ్గుతాయని కొందరు చేసిన హెచ్చరికలతో పవన్ అందరి బాటలోనే వెళ్ళనున్నారు.

ఇక సరికొత్త పంథాలో ప్రజల్లోకి వెళుతోన్న జనసేనకు ఇప్పటికే చాలా వరకు జనసైన్యం వచ్చి చేరింది. కంటెంటైర్ రైటర్లు, స్పీకర్లకు పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన వారితో పవన్ పోరాటం స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల్లో 40 శాతం పాతవారే ఉంటారన్న లీకులతో చాలామందిలో నైరాశ్యం ఆవహించింది. ఇప్పటి నుంచే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు రాకపోతే తమ ఫ్యూచర్ ఏంటన్న టెన్షన్ చాలా మందిలో ఉంది.

ప్రస్తుతం టీడీపీ, వైసీపీలో ఉన్న కొందరు కీలక నాయకులకు జనసేన టిక్కెట్లు ఇవ్వవచ్చన్న సంకేతాలు వస్తుండడంతో చాలామంది పార్టీ నాయకులు తాము ఇప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడి వచ్చే ఎన్నికల్లో జంపింగ్ నాయకుల కింద పనిచేయాలా ? అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పాత నాయకులకు టిక్కెట్ల ప్రకటన జనసేనలో పెద్ద గోలగోలగా ఉంది. దీనిని పవన్ ఎలా అధిగమిస్తాడో ? చూడాలి.