యువభేరికి ఓసీ సంఘం మద్దతు…

యువభేరికి ఓసీ సంఘం మద్దతు…

ఆంధ్రుల హక్కుల సాధన కోసం ఈ నెల 10న అనంతపురం పట్టణంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించే యువభేరి విజయవంతం చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి. కరుణాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు కల్పించే అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యం లో పెట్టుబడులు అత్యధిక శాతం వచ్చి లక్షలాది మందికి విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వైఎస్‌ జగన్‌ నిర్వహించే ప్రత్యేక ఉద్యమానికి పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, నేతలు మద్దతు ఇవ్వాలని యువభేరికి ఓసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. అత్యధిక శాతం ఓసీ విద్యార్థులు, యువత ఇందులో పాల్గొంటారని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రం నష్టపోతున్నా కొన్ని రాజకీయ పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం సమంజసం కాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని గగ్గోలుపెట్టిన చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం సిగ్గుచేటన్నారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశంలో ప్రత్యేక హోదాపై ఇతర రాష్ట్రాల ఎంపీలను కలుపుకొని సాధించే వరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.