‘అనంత’లో నేడు యువభేరి…

‘అనంత’లో నేడు యువభేరి…

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ఉద్యమంలో భాగంగా మంగళవారం అనంతపురంలో ‘యువభేరి’ నిర్వహించనున్నారు. నగర శివారున బళ్లారి రోడ్డులోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాలులో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం ఉదయం జగన్‌.. విమానంలో బయలుదేరి బెంగళూరుకు చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉదయం 9 గంటలకు కొడికొండ చెక్‌పోస్ట్‌ వద్దకు వస్తారు. అక్కడి నుంచి నేరుగా 10.30 గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారు. ‘యువభేరి’ సదస్సు నిర్వహణకు స్థానిక పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హాలు బయట ఉన్న వారికి లోపలి దృశ్యం కనిపించేలా భారీ ఎల్‌ఈడీలు, స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వేలాది మంది విద్యార్థులు, యువతీ యువకులు, మేధావులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

వేదికపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ప్రొఫెసర్లు, న్యాయవాదులు, టీచర్లు, వివిధ రంగాలకు చెందిన మేధావులు కూర్చోనున్నారు. వీరంతా హోదా ఆవశ్యకత గురించి ప్రసంగించనున్నారు. విద్యార్థులు, యువతతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజనతో పూర్తిగా వెనుకబడిన రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి సాధించాలంటే సంజీవని లాంటి ప్రత్యేక హోదాతోనే సాధ్యమనే విషయాన్ని జగన్‌.. యువత, విద్యార్థులకు వివరించనున్నారు.

సోమవారం సాయంత్రం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, రాప్తాడు, అనంతపురం నియోజకవర్గాల సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, నదీం అహమ్మద్, రాష్ట్ర కార్యదర్శి బుర్రా సురేష్‌ గౌడ్, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.