కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను కిడ్నాప్‌… పోలీసుల ఛేజ్

కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను కిడ్నాప్‌… పోలీసుల ఛేజ్

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలో ప్రేమజంటపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నవీన్‌కుమార్‌ను కొట్టి కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిన సిరిచందనను పోలీసులు విడిపించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. రాయచూరులో సమీపంలో వీరిని పట్టుకున్నట్టు తెలుస్తోంది.

కులాంతర వివాహం చేసుకున్న తన కుమార్తెను ఎలాగైనా తీసుకెళ్లాలన్న ఉద్దేశంలో సిరిచందన తండ్రి రాంభూపాల్‌ రెడ్డి కొంత మంది సహకారంతో సోమవారం ఆమెను కిడ్నాప్‌ చేశాడు. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సిరిచందన, నవీన్‌కుమార్‌, అతడి సోదరి రేవతిలపై తొండవాడ సమీపంలో రాంభూపాల్‌ రెడ్డి తన అనుచరులతో దాడి చేశారు. నవీన్‌ కళ్లలో కారంకొట్టి, గాయపరిచి సిరిచందనను తీసుకుపోయారు. తమపై విచక్షణారహితంగా దాడి చేశారని, చంపడానికి కూడా వెనుకాడబోమన్నట్టుగా దుండగులు వ్యవహరించారని రేవతి ఆరోపించారు.

అసలు గొడవేంటి..?
కడపకు చెందిన రాంభూపాల్‌ రెడ్డి కుమార్తె సిరిచందన ఎంబీబీఎస్‌ పూర్తి చేసి తిరుపతిలో హౌస్‌ సర్జన్‌ చేస్తోంది. సిరిచందన, తోటి వైద్యురాలు రేవతి ప్రాణ స్నేహితులు. ఈ నేపథ్యంలో రేవతి అన్నయ్య నవీన్‌ కుమార్‌తో సిరిచందన ప్రేమలో పడింది. రెండు నెలల క్రితం వారిద్దరూ ఇంట్లో ఎవరికి చెప్పకుండా తొండవాడలోని ఓ ఆలయంలో ఆగస్టు 16న వివాహం చేసుకున్నారు. అనంతరం ఎస్పీని ఆశ్రయించారు. ఈ విషయం తెలుసుకున్న సిరిచందన తల్లిదండ్రులు తిరుపతికి చేరుకుని అలిపిరి పోలీసు స్టేషన్‌లో పలుమార్లు పంచాయితీ నిర్విహించారు.

ఎంతకీ నవీన్‌కుమార్‌ను వదిలి సిరిచందన రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సిరిచందన మూడు రోజుల క్రితం చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో హౌస్‌ సర్జన్‌ ట్రైనీగా చేరింది. ఆమె తండ్రి రాంభూపాల్‌ రెడ్డి కుమార్తెను కిడ్నాప్‌ చేయాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగానే సోమవారం నవీన్‌, అతడి సోదరిపై దాడి చేసి సిరిచందనను తీసుకుపోయాడు. పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు.