బాబు పునాదులు కదిలేలా వ్యూహాం… 6నెలలు! 3వేల కిలోమీటర్లు

బాబు పునాదులు కదిలేలా వ్యూహాం… 6నెలలు! 3వేల కిలోమీటర్లు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలు సిన్సియర్‌గా నిర్వహించాలని ఆయన సూచించారు. ఏ మాత్రం ఏమరపాటు తగదని హితవు పలికారు.

పార్టీ నేతలందరూ తమ శక్తియుక్తుల్నీ కూడదీసుకుని చంద్రబాబు పార్టీ పునాదుల్ని కదిపేలా ఎన్నికలకు సిద్ధం కావాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల వరకూ ప్రతి క్షణం ఎంతో విలువైందని, ప్రజాస్వామిక యుద్ధానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పేర్కొన్నారు. అంతా ఒక్కటై ముందుకు నడవాలని పార్టీ నేతలకు జగన్ స్పష్టం చేశారు.

పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పార్టీ పరిశీలకులతో వైయస్‌ జగన్‌ బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటలసేపు ఈ సమావేశం కొనసాగింది. కాగా, వైయస్‌ జగన్‌ నవంబర్‌ 2 నుంచి పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పాదయాత్ర సమయంలోఒక జిల్లాలో యాత్ర చేపడుతున్న సమయంలో మిగిలిన 12 జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, నిర్వహించాల్సిన కార్యక్రమాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిందిగా జగన్ ఈ సందర్భంగా నేతలను కోరారు. దాదాపు 50మందికి పైగా తమ అభిప్రాయాలను పార్టీ అధ్యక్షుడికి వెల్లడించారు. వారి సలహాలు, సూచనలను వైఎస్‌ జగన్‌ నోట్‌ చేసుకోవడం గమనార్హం.

ఇలా పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకుంటూ, లోటుపాట్లను సరిచేసుకుంటూ జగన్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

కాగా, జగన్‌తో సమావేశానికి సంబంధించిన వివరాలను పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి మీడియాకు వెల్లడించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నవంబర్‌ 2వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ఎంపీ మేకపాటి తెలిపారు. ఆరు నెలల పాటు 3వేల కిలోమీటర్ల మీదగా 120 నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. అలాగే మిగతా 55 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడతారని తెలిపారు. పాదయాత్రపై పార్టీ నేతలతో వైఎస్‌ జగన్‌ చర్చించారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతల సూచనలు, సలహాలను ఆయన అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.

వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ కమిటీలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఎంపీ మేకపాటి తెలిపారు. ఏ పార్టీకి అయినా బూత్‌ కమిటీ ముఖ్యమైనదని, దాన్ని బలపడేలా చేసుకోవాలన్నారు. ఏవైనా చిన్న చిన్న తప్పులు ఉంటే వాటిని సవరించుకుని అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని అన్నారు. ప్రతి ఊరులోనూ వైసీపీ జెండా ఎగరాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు, బోగస్‌ ఓటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఓ పార్టీ గుర్తుపై గెలిచిన వారిని ప్రలోభపెట్టి, ఫిరాయింపులకు పాల్పడేలా చేయడం దారుణమని ఎంపీ మేకపాటి అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని, 21మంది ఎమ్మెల్యేలను ప్రలోబపెట్టి తమ పార్టీలోకి తీసుకున్నారన్నారు. ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని ఎంపీ మేకపాటి వ్యాఖ్యానించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే వైఎస్‌ఆర్‌ సీపీని అందరూ ఆదరించాలని పిలుపునిచ్చారు.

తన తండ్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలకు అనుగుణంగానే ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ కూడా చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తారని మేకపాటి అన్నారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న వైయస్‌ జగన్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. వైయస్ లాగానే జగన్‌ కూడా మంచి పనులు చేస్తారని, పాదయాత్రలో ఆయన్ని అందరూ ఆదరించాలన్నారు.

కేసుల భయంతోనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని కాలరాశారని మేకపాటి ఆరోపించారు. హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండేదన్నారు. ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయన్నారు. హోదా సాధించేవరకూ వైసీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. తమ రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే ఇప్పుడే రాజీనామా చేస్తామన్నారు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖను పంపిస్తామని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మేకపాటి అన్నారు.