టీడీపీ, బీజేపీ మధ్య పెరుగుతున్న దూరం…

టీడీపీ, బీజేపీ మధ్య పెరుగుతున్న దూరం…

టీడీపీ, బీజేపీ మధ్య దూరం అంతకంతకు పెరుగుతోంది. టీడీపీ నుంచి బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు లేకపోయినా…బీజేపీ నేతలు మాత్రం తెగదెంపులు చేసుకోవాల్సిందేనంటూ అంతర్గత సమావేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కోర్ కమిటీ కార్యవర్గ సమావేశాలు మూడు రోజుల పాటు గుంటూరులో జరిగాయి. బుధవారం ఉదయం కూడా కొంతమంది బీజేపీ అగ్ర నేతలు సంఘం నేతలతో సమావేశమయ్యారు. ఈ మూడు రోజుల సమావేశాల్లో తెలుగు దేశం పార్టీతో మిత్ర బంధంపై ఏపీ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకుంటే తప్ప సంస్థాగతంగా బలపడటం సాధ్యం కాదని మూడు సమావేశాల్లో కొంతమంది నేతలు కుండబద్ధలు కొట్టి చెప్పారు. బూత్ కమిటీలు వేయమని పై నుంచి ఒత్తిడివస్తుందని కానీ కమిటీల్లో ఉండేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని ఆ నేతలు తమ అనుభవాలను వివరించారు. ప్రభుత్వ పథకాలు కూడా బీజేపీ కార్యకర్తలకు అందటంలేదని వారు సమావేశాల్లో వివరించారు. కేంద్ర ఇస్తున్న నిధులతో నడుస్తున్న పధకాల్లోనూ బీజేపీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చడం లేదని వారు చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వృద్ధాప్య పెన్షన్లకు ఇచ్చే సొమ్ములో కేంద్రం వాటా ఉన్నా అన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని కొందరు ప్రభుత్వంపై విమర్శలు చేశారు.