‘టాటా’ ఎయిర్టెల్ చేతికి…

‘టాటా’ ఎయిర్టెల్ చేతికి…

టాటా గ్రూప్ త‌న టెలికాం వ్యాపారాన్ని ఎటువంటి న‌గ‌దు లావాదేవీ లేకుండా భార‌తి ఎయ‌ర్‌టెల్‌కు అప్ప‌గించ‌నుంది. టాటా టెలిస‌ర్వీసెస్ లిమిటెడ్‌కు చెందిన క‌న్సూమ‌ర్ మొబైల్ వ్యాపారాన్ని, టాటా టెలి మ‌హారాష్ట్ర(టీటీఎమ్ఎల్) సంస్థ‌ల‌ను భార‌తి ఎయిర్‌టెల్‌లో విలీనం చేయ‌నున్న‌ట్లు రెండు సంస్థ‌లు ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న చేశాయి. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి ముఖ్య విష‌యాలు తెలుసుకుందాం.

టాటా టెలిస‌ర్వీసెస్ ఎప్ప‌టినుంచో న‌ష్టాలు వ‌స్తున్న‌ప్ప‌టికీ దాన్ని లాభ‌సాటిగా మార్చేందుకు చాలా కృషి చేసింది. గత్యంత‌రం లేని పరిస్థితుల్లో త‌న ద‌గ్గ‌ర చెప్పుకోద‌గ్గ 4జీ స్పెక్ట్రం ఉన్న‌ప్ప‌టికీ దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ‌ను నిర్వ‌హిస్తున్న ఎయిర్‌టెల్కు త‌న వ్యాపారాన్ని అప్ప‌గించేందుకు సిద్ద‌మైంది. ఎటువంటి న‌గ‌దు ఆధారిత లావాదేవీల లేకుండా ఇదివ‌ర‌కే త‌మ సంస్థ‌ల అప్పుల‌ను టాటా గ్రూప్ చెల్లించేలా ఒప్పందం జ‌రిగింది. అంటే టాటా టెలి స‌ర్వీసెస్‌ను ఎయిర్‌టెల్కు అప్ప‌గించినందుకు ఎయిర్‌టెల్ ఎటువంటి డ‌బ్బు చెల్లించ‌దు.

ప్ర‌స్తుతం రెండు సంస్థ‌ల మధ్య‌ లావాదేవీ పూర్త‌యితే దేశ టెలికాం రంగంలో మూడే ప్ర‌ధాన సంస్థ‌లు ఉంటాయి. అవి ఐడియా-వోడాఫోన్ ఉమ్మ‌డి సంస్థ‌, భార‌తి ఎయిర్‌టెల్‌, రిల‌య‌న్స్ జియో. ఐడియా-వోడాఫోన్ విలీన ప్ర‌క్రియ పూర్త‌యితే ఎయిర్టెల్ రెండో స్థానానికి ప‌డిపోతుంది. అయితే టాటా టెలిస‌ర్వీసెస్ భార‌తి ఎయిర్టెల్‌లో క‌లిసిపోనుండ‌టం ఆ సంస్థ‌కు కొద్దిగా లాభిస్తుంది. దీనికి సంబంధించి గురువార‌మే ఎక‌న‌క‌మిక్ టైమ్స్ వార్తా క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

ఈ విలీనం విలువ ఎంతన్నదీ ఇటు ఎయిర్‌టెల్ గానీ, అటు టాటా టెలీ సర్వీసెస్ గానీ వెల్లడించలేదు. అయితే ఈ విలీనం రుణ రహితంగానూ, నగదు రహితంగానూ ఉంటుందని, టిటిఎస్‌ఎల్‌కు సంబందించిన రుణాలన్నింటినీ టాటా కంపెనీయే సర్దుబాటు చేసుకుంటుందని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి. ప్ర‌స్తుతానికి టెలికాం సేవ‌ల వ‌ర‌కే రెండు సంస్థ‌ల మ‌ధ్య ఒప్పందం కుదిరింద‌ని భ‌విష్య‌త్తులో డీటీహెచ్‌, ఎంట‌ర్‌ప్రైజ్‌, విదేశీ కేబుల్ వ్యాపారం సంబంధించి అవ‌గాహ‌న కుద‌ర‌వ‌చ్చ‌ని రెండు సంస్థ‌ల ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న తెలిపింది.

ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం దేశంలోని 19 సర్కిళ్లలో టాటా టెలీ సర్వీసెస్‌కు చెందిన మొబైల్ వ్యాపారం ఎయిర్‌టెల్ చేతుల్లోకి వెళ్తుంది. దీంతో సుమారు 4 కోట్ల మంది వినియోగదారులు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోకి వస్తారు. అలాగే టిటిఎస్‌ఎల్‌కు చెందిన 178.5 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్, 1800, 2100, 850 మెగా హెర్ట్జ్ బ్యాండ్‌లు ఎయిర్‌టెల్ సొంతమవుతాయి. టాటా గ్రూప్‌కు 19 స‌ర్కిళ్ల‌లో 4జీ స్పెక్ట్రం ఉంది.

టాటా గ్రూప్, త‌మ భాగస్వాముల‌కు ఇది ఉత్త‌మ ఒప్పందం అని టాటా స‌న్స్ ఛైర్మ‌న్ ఎన్‌.చంద్ర‌శేఖ‌ర‌న్ వెల్ల‌డించారు. ‘ఎప్ప‌టి నుంచో ఉన్న త‌మ వినియోగ‌దారుల‌కు త‌మ సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు స‌రైన కొత్త సంస్థ కోసం వెతికాం, మంచి దాన్నే ఎంచుకున్నాం.’ అని ఎక‌న‌మిక్‌టైమ్స్‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో చెప్పారు.
అప్పుల్లో కూరుకుపోయిన టాటా టెలిస‌ర్వీసెస్ నిర్వ‌హ‌ణ ఒక పెద్ద స‌మ‌స్య అని గ‌త వారం ఆయ‌న అభివ‌ర్ణించారు.

భార‌తీ ఎయిర్‌టెల్ ఛైర్మ‌న్ సునీల్ మిట్ట‌ల్ మాట్లాడుతూ ఈ ఒప్పందం చాలా సర్కిళ్ల‌లో త‌మ‌కు బ‌లం చేకూరేలా చేస్తుంద‌న్నారు. ‘డీల్ పూర్త‌యితే వినియోగ‌దారుకైనా, నెట్‌వ‌ర్క్ ప‌రంగానైనా క‌ల‌యిక బాగా జ‌రుగుతుంద‌ని అన్నారు. 5 వేల మంది ఉద్యోగులు కొత్త సంస్థ‌లో భాగ‌స్వాముల‌వుతారు. టాటా టెలిస‌ర్వీసెస్ మొత్తం స్పెక్ట్రంలో 40% 4జీ కావ‌డం గ‌మ‌నార్హం. టాటా కేవ‌లం మొబైల్ సేవ‌లే కాకుండా ఎంట‌ర్‌ప్రైజ్‌, ఫిక్స్‌డ్ లైన్‌, బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారాల నిర్వ‌హ‌ణ‌లో నిమ‌గ్న‌మై ఉండ‌టం ఎయిర్‌టెల్‌కు క‌లిసి రానుంది.

రెండు సంస్థ‌లు చెప్పిన దాని ప్ర‌కారం ”టాటా గ్రూప్ టెలికాం శాఖ‌కు డ‌బ్బులు చెల్లించని స్పెక్ట్రం ఇంకా కొద్దిగా ఉంది. దానికి సంబంధించి ఒక విధానం ఏర్పాటు చేసుకుంటాం. టాటా టెలిస‌ర్వీసెస్ పాత అప్పులన్నీ అదే సంస్థ తీర్చేస్తుంది. ఈ అప్పులు దాదాపు రూ.31 వేల కోట్ల వ‌ర‌కూ ఉండొచ్చు.” ఈ వ్య‌వహారంతో సంబంధం ఉన్న ఒక వ్య‌క్తి చెప్పిన దాని ప్ర‌కారం 10 వేల కోట్ల స్పెక్ట్రం చెల్లింపుల్లో ఎయిర్‌టెల్ న‌గ‌దు చెల్లింపు చేయాల్సింది దాదాపు రూ.1500 నుంచి రూ.2000 కోట్ల వ‌ర‌కూ ఉండ‌వ‌చ్చు.