కాలేజీ కాదు ‘నరకం’: సాయి ప్రజ్వల మిస్సింగ్ వెనుక స్టొరీ

కాలేజీ కాదు ‘నరకం’: సాయి ప్రజ్వల మిస్సింగ్ వెనుక స్టొరీ

కార్పోరేట్ చదువుల మాయ విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ర్యాంకుల పోటీలో వారిపై విపరీతమైన ఒత్తిడి పెంచి ఆత్మన్యూనత భావంలో కూరుకుపోయేలా చేస్తోంది. ఎంతసేపూ ర్యాంకుల గోలే తప్ప.. జీవితాన్ని బోధించేవారే కరువవడంతో.. విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు.

ఈ పోటీ ప్రపంచానికి తాము కరెక్ట్ కాదని, తమకంత సామర్థ్యం లేదని కుమిలిపోతున్నారు. విద్యా రంగాన్ని కార్పోరేట్ ప్రపంచం శాసించడం మొదలైన తర్వాత.. ఇంటర్మీడియట్ అంటేనే నరకంగా మారిపోయిన పరిస్థితి. నాలుగు గోడల ప్రపంచంలో చదువు పేరిట వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

గడిచినమూడేళ్లలో 60మంది 
మూడేళ్లలో 60మంది

గడిచిన మూడేళ్లలో ఒక్క ఏపీలోనే 60 మంది ఇంటర్‌ విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే కార్పోరేట్ శక్తులు వారిని ఎంతలా కుంగదీశాయో అర్థం చేసుకోవచ్చు. గత 10రోజుల్లోనే 8మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా.. నారాయణ, చైతన్య కాలేజీల్లో నమోదైన కేసులే ఇందులో ఎక్కువ. అయినా సరే ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్లైనా కావట్లేదు. ఓవైపు విద్యార్థులంతా పిట్టల్లా రాలిపోతుంటే.. ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు.

మిస్సింగ్ 
సాయి ప్రజ్వల మిస్సింగ్:

మొన్న కృష్ణా జిల్లా గూడవల్లిలో, నిన్న విజయవాడలో, ఆదివారం హైదరాబాద్‌లో సాయి ప్రజ్వల అనే మరో విద్యార్థిని ఒత్తిడి తట్టుకోలేక హాస్టల్ నుంచి అదృశ్యమైంది. హైదరాబాద్‌ సమీపంలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో ప్రజ్వల బైపీసీ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటోంది. గత కొద్ది రోజులుగా ఆమె కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యమవడం కన్నా ముందు రోజు ఆమె రాసిన లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది.

సాయిప్రజ్వల వేదన 
బంధువుల ఇంటికి తీసుకెళ్లినా:

నారాయణ కాలేజీ హాస్టల్లో తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న ప్రజ్వలను ఇటీవల ఆమె తల్లిదండ్రులు నగరంలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. ప్రజ్వల కోలుకుంటుందని వారు భావించినప్పటికీ.. ఎవరూ ఊహించని విధంగా ఆమె కనిపించకుండా పోయింది.

నారాయణ కాలేజీలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు లేఖ రాసి ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే కాలేజీలో ఏదో జరగటం వల్లే తమ బిడ్డ వెళ్లిపోయిందని విద్యార్థిని తండ్రి విద్యాగిరి శ్రీనివాస్‌ ఆరోపిస్తుండటం గమనార్హం. ప్రజ్వల కుటుంబం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం అడ్డగుంటపల్లిలో నివాసముంటోంది. ఇటీవల కడప నారాయణ కాలేజీలో పావని అనే విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

వసతుల్లేని హాస్టల్స్ 
నరకప్రాయంగా హాస్టల్స్:

విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తూ వేల కొద్ది విద్యార్థులను చేర్చుకుంటున్న కార్పోరేట్ కాలేజీలు వారికి సరైన వసతులు కల్పించడంలో తీవ్రంగా విఫలమవుతున్నాయి. ముగ్గురికి మించి పట్టని గదిలోను ఆరేడు మందిని కుక్కుతున్నారు. సరిపోయేన్ని టాయిలెట్స్ ఉండటం లేదు. ఇక భోజనం సంగతి సరే సరి. అదే సమయంలో ఫీజులు మాత్రం ముక్కు పిండి మరీ లక్షలు వసూలు చేస్తున్నారు.

అడ్డగోలు అడ్మిషన్లతో ఇబ్బడిముబ్బడిగా విద్యార్థులను చేర్చుకుని.. వారికి నరకం చూపిస్తున్నాయి కార్పోరేట్ విద్యా సంస్థలు. ఇవన్నీ ఒకెత్తు అయితే.. చదువు పేరిట ఉదయం 5గం. నుంచి మొదలుపెడితే రాత్రి 11గం. వరకు వారిని క్లాస్ రూమ్ కే పరిమితం చేస్తున్నారు. కేవలం తినడానికి మాత్రమే వారికి బ్రేక్ ఇస్తున్నారు. ఆఖరికి కాలకృత్యాలు తీర్చుకుందామన్న సమయం లేని దుస్థితి వారిది. ఇతర వ్యాపకం ఏది లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

వెళ్లిపోయే ముందు లేఖ 
సాయి ప్రజ్వల లేఖ ఇది:

‘సారీ మమ్మీ… సారీ డాడీ.. ఐ మిస్‌ యూ సోమచ్‌.. బై సన్నీ.., టెన్త్‌లో మంచి మార్కులు తెచ్చుకో..బై అక్కా.. బాగా చదివి గ్రూప్స్‌ సాధించి నాన్నకు మంచి పేరు తీసుకురా.. నాకోసం వెతకొద్దు ప్లీజ్‌..వేస్ట్‌ నారాయణ కాలేజీ… క్లోజ్‌ ది నారాయణ కాలేజీ… నారాయణ కాలేజీ కిల్లింగ్‌ ద స్టూడెంట్స్‌ టు రీడ్‌… సో ప్లీజ్‌ హెల్ప్‌ ద స్టూడెంట్స్‌ ఫ్రం నారాయణ. దే ఆర్‌ ఆర్‌ సఫరింగ్‌ ఇన్‌ దిస్‌ కాలేజీ, హాస్టల్‌… సారీ మమ్మీడాడీ’-సాయిప్రజ్వల.

 

Related Images: