పాకిస్థాన్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్‌

పాకిస్థాన్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్‌

విజయ పరంపరలో మరో తీపి గెలుపు భారత్‌ సొంతమైంది. ఉత్కంఠ దాయాదుల పోరులో పాకిస్థాన్‌ను 3-1తో మట్టికరిపించింది. ఆది నుంచి భారత్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించగా.. ఆత్మ రక్షణలో పడిపోయిన పాకిస్థాన్‌ సింగిల్‌ గోల్‌ కోసం తీవ్రంగా శ్రమపడింది. తొలి పోరుల్లో జపాన్‌, బంగ్లాదేశ్‌లపై రెండేసి గోల్స్‌తో చెలరేగిన హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పాక్‌తో మ్యాచ్‌లో మరోసారి మెరిసాడు. పూర్తిగా రక్షణాత్మ ధోరణిలోనే ఇరు జట్లు ఆడినా మూడు గోల్స్‌ చేయటంలో భారత్‌ సఫలమైంది. పూల్‌ ఎ లో లీగ్‌ దశను మూడు విజయాలతో ముగించి అగ్రస్థానంలో కొనసాగుతున్నది. 
 మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో హాకీ ఆసియా కప్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌ టైటిల్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. అద్భుత విజయాలతో జోరు మీదున్న టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. పూల్‌ ఎ లీగ్‌ దశలో తుదిదైన మూడో పోరులో 3-1తో విజయం సాధించింది. ఆదివారం జరిగిన ధనాధన్‌ హకీ సమరంలో ఆటగాళ్లు చింగ్లేన్‌సనా సింగ్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌లు భారత్‌ తరఫున గోల్స్‌ చేశారు. జపాన్‌పై 5-1తో, బంగ్లాదేశ్‌పై 7-0తో సునాయసంగా గెలిచిన భారత్‌ పాకిస్థాన్‌తో పోరులో కష్టపడాల్సి వస్తుందేమో అని అంతా భావించారు. అయితే డిఫెన్స్‌లో భారత్‌ దుమ్మురేపటంతో సింగిల్‌ గోల్‌ ఖాతాలో వేసుకోవటానికి పాకిస్థాన్‌ చాలా కష్టపడింది.
ఇరు జట్లు డిఫెన్స్‌ మీద దృష్టి సారించటంతో తొలి క్వార్టర్‌లో ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ అందించిన పాస్‌ను ఆకాశ్‌దీప్‌ గోల్‌ చేసే ప్రయత్నం కాస్తలో మిస్సయింది. దీంతో గోల్‌ పోస్ట్‌పై దాడికి భారత్‌ సిద్ధంగా ఉన్నదని ప్రత్యర్థులకు అర్థమైంది. టీమ్‌ ఇండియా ఆటగాళ్లు మైదానంలో పాస్‌లు అందించే విధానం అబ్బురపరచింది. పాక్‌ ఆటగాళ్లు సైతం అలాంటి ప్రయత్నాలే చేసినా, సమన్వయ లోపం కొట్టొచినట్టు కనిపించింది. ఇంకో నిమిషంలో మొదటి క్వార్టర్‌ ముగుస్తుందనగా పాకిస్థాన్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. కానీ, భారత్‌ పటిష్ట డిఫెన్స్‌ ముందు చేసిన గోల్‌ ప్రయత్నంలో దాయాది జట్టు బోల్తా పడింది. రెండో క్వార్టర్‌ ఆరంభంలోనే ఆకాశ్‌దీప్‌ సింగ్‌ అందించిన చక్కటి పాస్‌ను చురుగ్గా అందుకున్న చింగ్లేన్‌సనా 17వ నిమిషంలో గోల్‌గా మలచి భారత్‌ గోల్‌ ఖాతా తెరిచాడు. మరోసారి పాకిస్థాన్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించినా, భారత గోల్‌ కీపర్‌ సూరజ్‌ ఖర్కేరా సమర్ధవంతంగా అడ్డుకున్నాడు. 44వ నిమిషంలో రమణ్‌దీప్‌ సింగ్‌, నిమిషం వ్యవధిలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ చెరో గోల్‌ చేయటంతో తుది క్వార్టర్‌ వరుకు మ్యాచ్‌ను శాసించిన భారత్‌ 3-0తో ఆధిక్యంలో నిలిచింది. పాకిస్థాన్‌ ఓటమి భారాన్ని అలీ షాన్‌ ఓ గోల్‌తో తగ్గించే ప్రయత్నం చేశాడు. పూల్‌ ఎ లో తొమ్మిది పాయింట్లతో భారత్‌ టాప్‌లో కొనసాగుతుండగా, పాకిస్థాన్‌ రెండో స్థానంలో నిలిచింది. 1956 నుంచి ఇప్పటిదాకా భారత్‌, పాకిస్థాన్‌లు తలపడిని మేజర్‌ టోర్నమెంట్‌ ముఖాముఖిల్లో 25-22తో పాకిస్థాన్‌ ముందున్నది.