ఆధార్ తో అనుసంధానం చేసారా?

ఆధార్ తో అనుసంధానం చేసారా?

కేంద్రం ఇప్పుడు అన్నింటికి ఆధార్ అనుసంధానం చేసింది. ప్రభుత్వ వంట గ్యాస్‌, వృద్దాప్య పెన్షన్‌తో సహా రకరకాల సబ్సిడీ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందడానికి, స్థిరాస్తులు, వాహనాల రిజిస్ర్టేషన్‌కు, కొత్త మొబైల్‌ నెంబర్‌ కనెక్షన్‌, రేషన్‌ కార్డు, పాన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, బ్యాంకు ఖాతా తదితరాలన్నింటికీ ఆధార్ కీలకంగా మారింది.

ఫ్రీ అంటూనే అదనపు ఛార్జీల బాదుడు షురూ చేసిన జియో

ఈ నేపథ్యంలో మొబైల్‌ నెంబర్‌ను గుర్తుంచుకుంటున్నట్టుగానే 12 అంకెల ఆధార్‌ నెంబర్‌ను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే రోజులు వచ్చేశాయి. ఆధార్‌ను కీలకమైన పలు సర్వీసులతో, విభాగాలతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం గడువును కూడా ప్రకటించింది. ఆ వివరాలేంటో తెలుసుకోండి.

మొబైల్‌ నెంబర్‌తో..

తుది గడువు ఫిబ్రవరి, 2018 
ప్రీపెయిడ్‌, పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ నెంబర్లతో కస్టమర్లు ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియ సాగుతోంది. దీనికి తుది గడువు వచ్చే ఫిబ్రవరి. మొబైల్‌ వినియోగదారు సంబంధిత టెలికాం సంస్థకు చెందిన స్టోర్‌కు వెళ్లి తమ మొబైల్‌ నెంబర్‌ను తెలియజేస్తే వారు పాత మొబైల్‌ నెంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేస్తారు.

బ్యాంకు ఖాతాతో..

తుది గడువు డిసెంబర్‌ 31, 2017
బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ నెంబర్‌ను ఆ ఖాతాతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇందుకు తుది గడువు వచ్చే డిసెంబర్‌ 31వ తేదీ. విభిన్న మార్గాల ద్వారా బ్యాంకు ఖాతాతో ఆధార్‌ను అనుసంధానం చేసే అవకాశాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. నెట్‌ బ్యాంకింగ్‌, ఎటిఎం, ఎస్‌ఎంఎస్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారానే కాకుండా నేరుగా బ్యాంకుకు వెళ్లి ఖాతాదారు తన ఆధార్‌ను ఖాతాతో అనుసంధానం చేయవచ్చు.

పాన్‌ కార్డుతో..

తుది గడువు డిసెంబర్‌ 31, 2017
ఆదాయం పన్ను రిటర్నులను సమర్పించే వారు తమ పాన్‌ నెంబర్‌తో ఆధార్‌ నెంబర్‌ను లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు దీని గడువు ఆగస్టు 31 వరకే ఉండేది. అయితే ఈ గడువును ఈ ఏడాది సెప్టెంబర్‌ 31 వరకు పెంచారు. incometaxindiaefiling.gov.in లింక్‌ ద్వారా ఆదాయం పన్ను శాఖ ఇ-ఫైలింగ్‌ పేజీలోకి వెళ్లడం ద్వారా ఆధార్‌ను పాన్ కార్డుతో అనుసంధానం చేయవచ్చు.

సామాజిక భద్రత స్కీమ్‌లకు..

గడువు డిసెంబర్‌ 31, 2017
సామాజిక భద్రతా పథకాల ద్వారా ప్రయోజనం పొందే వారందరూ డిసెంబర్‌ 31లోగా తమ ఆధార్‌ నెంబర్‌ను ఆయా ప్రభుత్వ శాఖలకు అందజేయాల్సి ఉంటుంది. పెన్షన్లు, స్కాలర్‌షిప్పులు, ఎల్‌పిజి సబ్సిడీలకు ఇది అనివార్యం. డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీకి కూడా ఆధార్‌ను అనివార్యం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. పిపిఎఫ్‌, జాతీయ పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసినవారు కూడా డిసెంబర్‌ 31లోగా ఆధార్‌ వివరాలను అందజేయాల్సి ఉంటుంది.