విహారయాత్రలో విషాదం, 4 ఇంజినీర్లు దుర్మరణం….

విహారయాత్రలో విషాదం, 4 ఇంజినీర్లు దుర్మరణం….

కోవై జిల్లా పల్లడం సమీపంలో బీఏబీ కాలువలో కారు బోల్తాపడిన సంఘటనలో నలుగురు ఇంజినీర్లు కాలువలో మునిగి దుర్మరణం పాలయ్యారు. కోవై జిల్లా అత్తిపాలయంలో శోభనా ఇంజినీరింగ్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఉంది. ఇందులో పని చేస్తున్న ఇంజినీర్లు,  ఆదివారం పర్యాటక యాత్రగా కొడైకెనాల్‌కు వెళ్లారు. 25 మంది ఒక బస్సులోను, ప్రదీప్‌(27), విజయన్‌(30), మారియప్పన్‌(32), సుధాకర్‌(25), అన్పలగన్‌(30) ఐదుగురు ఒక కారులో కొడైకెనాల్‌ వెళ్లారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విహారం పూర్తి చేసుకుని సాయంత్రం కోవైకు తిరుగు ప్రయాణం అయ్యారు. బస్సు వెనుకనే కారు ప్రయాణిస్తోంది. రాత్రి 8 గంటల సమయంలో పల్లడం సమీపంలో కల్లిపాలయం ప్రాంతంలో మలుపు తిరుగుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన గల బీఏబీ కాలువలో పడిపోయింది.

ఈ కాలువలో ఏడాది తర్వాత వారం రోజుల కిందట నీరు వదిలినట్టు తెలిసింది. కారులో ఉన్న ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. వారి అరుపులు విని చుట్టు పక్కల వారు పరుగున వచ్చి కారులో ప్రాణాలకు పోరాడుతున్న అన్బళగన్‌ను రక్షించగలిగారు. ప్రదీప్, విజయన్, మారియప్పన్, సుధాకర్‌ నీటిలో మునిగి మృతి చెందారు. కామనాయగన్‌ పాలయం పోలీసులు, పల్లడం అగ్నిమాపకదళం సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని కారును వెలికి తీసే పనులలో నిమగ్నమయ్యారు. సుధాకర్‌ తప్ప మిగతా ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. సుధాకర్‌ మృతదేహం కోసం కాలువలో గాలిస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. విహార యాత్ర విషాదంగా మారి నలుగురు ప్రాణాలను బలి తీసుకున్న సంఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.