హైదరాబాద్ నగర శివార్లలో చెడ్డి గ్యాంగ్ కలకలం…

హైదరాబాద్ నగర శివార్లలో చెడ్డి గ్యాంగ్ కలకలం…

నగర శివార్లలో చెడ్డి గ్యాంగ్ సంచారం కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఓ కాలనీలో సంచరించిన ఆనవాళ్ళను పోలీసులు గుర్తించారు.

ఇప్పటికే నగరంలో చెడ్డి గ్యాంగ్ దోపిడీలకు పథకం వేసిందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఈ గ్యాంగ్‌లు నగరంలోని ఆయా ప్రాంతాల్లో దోపిడీలకు పథకం వేశాయి. ఒక్కో గ్యాంగ్‌లో పది మంది వరకు ఉంటారు. వీరు మారణాయుధాలు కలిగి ఉంటారు. దోపిడీ సమయంలో ఎవరైనా అడ్డగిస్తే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు. దీంతో ఈ గ్యాంగ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగా… చెడ్డీ గ్యాంగు సభ్యులు చెడ్డీలు, బనియన్లు ధరించి ముఖానికి ముసుగు వేసుకుంటారని తెలియవచ్చింది. ముఖ్యంగా కాలనీల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దోపిడీ చేస్తారు. ఈ చెడ్డి గ్యాంగుకు మరో పేరు కచ్చా బనియన్ గ్యాంగ్.

శరీరానికి ఒండ్రు మట్టి గాని లేదా నూనె రాసుకుని సంచరిస్తారని సమాచారం. పగలు కుర్తా లేకపోతే లుంగీ ధరిస్తారని, ఈ గ్యాంగ్ ఎక్కువగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో లేదా కాలనీల్లో ఉన్న ఖాళీ ప్లాట్లలో బస చేస్తారు. పగలు బిచ్చగాళ్లలాగా లేదా కూలీలలాగా నటిస్తూ కాలనీలలో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిళ్ళు దోపిడీ చేస్తారని తెలుస్తోంది. ఒకేరాత్రి 2 – 4 ఇళ్లను దోచుకుంటారని తెలిసింది.

ఇదిలా ఉండగా… ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ సభ్యులు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సంచరించినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ సిబ్బందిని ఉన్నతాధికారులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించే విధంగా సూచనలు చేశారు.