విజయ్‌సాయి పై సంచలన ఆరోపణలు…

విజయ్‌సాయి పై సంచలన ఆరోపణలు…

సినీ నటుడు కాలే విజయ్‌సాయి ఆత్మహత్యపై అతడి కుటుంబ సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అతడి మరణానికి మీరు కారణమంటే మీరు కారణమని వాదించుకుంటున్నారు. మరోవైపు విజయ్‌ మృతదేహానికి ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేశారు.

తప్పుచేశాడు: వనిత
విజయ్‌ ఆత్మహత్య చేసుకుని తప్పు చేశాడని, ఇంత పిరికివాడని అనుకోలేదని అతడి భార్య వనిత పేర్కొన్నారు. తాను తప్పు చేస్తే శిక్ష  అనుభవిస్తానని అన్నారు. తనపై ఆరోపణలు చేసే వారు తమ బిడ్డ భవిష్యత్‌ గురించి ఆలోచించాలని కోరారు. నిజానిజాలు కోర్టులో తేలతాయని పేర్కొంటూ ఒక వీడియో విడుదల చేశారు. తనను బలిపశువును చేయడానికి విజయ్ తండ్రి సుబ్బారావు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఆస్తి కోసం కొడుకును చంపుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వనిత క్యారెక్టర్‌ మంచిది కాదు: మామ
తన కొడుకు మరణానికి కోడలే కారణమని విజయ్‌ తండ్రి సుబ్బారావు ఆరోపించారు. వనిత క్యారెక్టర్‌ మంచిది కాదని, మొదటి భర్తను మోసం చేసిందన్నారు. ఆమెకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని సరైన సమయంలో బయటపెడతామని హెచ్చరించారు. తన కొడుకుతో తమకు ఎలాంటి గొడవలు లేవని, చనిపోయేముందు వరకు కూడా తమతో సంతోషంగా ఉండేవాడని వెల్లడించారు. తన మనవరాలి విషయంలో కోర్టు ఆదేశాలను పాటిస్తానని చెప్పారు.  

 

రహస్యంగా పెళ్లి: వనిత సోదరుడు
తన బావ విజయ్‌సాయికి చాలా మంది అమ్మాయిలతో సంబంధాలున్నాయని అతడి బావమరిది రామచంద్రారెడ్డి ఆరోపించారు. తన అక్క వనితపై అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాచిలర్‌ సినిమా షూటింగ్‌ సమయంలో విజయ్‌తో తన సోదరి ప్రేమలో పడిందని తెలిపారు. వీరిద్దరికి పెళ్లి రెండువైపులా పెద్దలు ఒప్పుకోకపోవడంతో యాదగిరిగుట్టలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వెల్లడించారు. పెళ్లైన కొద్ది రోజులకే వనితను విజయ్‌ వేధించడం మొదలుపెట్టాడని తెలిపారు. తప్పంతా విజయ్‌, వాళ్ల కుటుంబ సభ్యులదేనని అన్నారు.
 
అశ్రునయనాలతో వీడ్కోలు
విజయ్‌సాయి మృతదేహానికి మంగళవారం మధ్యాహ్నం ఎర్రగడ్డ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అతడి తండ్రి సుబ్బారావు దహన సంస్కారాలు చేశారు. అంతకుముందు పలువురు సినీ నటులు విజయ్‌సాయి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అందరినీ నవ్విస్తూ ఉండే విజయ్‌ ఆత్మహత్య చేసుకోవడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్‌ తల్లి కొడుకు మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆమెను ఆపడం ఎవరితరం కాలేదు. అశ్రునయనాలతో అతడికి కడసారి వీడ్కోలు పలికారు.