‘అ’ ట్రైలర్‌ అదిరిపోయింది..!

‘చేపలకు కూడా కన్నీళ్లు ఉంటాయ్‌ బాస్‌. నీళ్లలో ఉంటామ్‌ కదా! కనపడవంతే!’ అంటున్నారు నాని.వాల్‌పోస్టర్‌ సినిమా పతాకంపై ఆయన సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘అ!’. ప్రశాంత్‌ వర్మ దర్శకుడు. కాజల్‌, నిత్యామేనన్‌, రెజీనా, ఇషారెబ్బ, శ్రీనివాస్‌ అవసరాల, ప్రియదర్శి, మురళీశర్మ కీలక పాత్రలు పోషించారు. బుధవారం ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

నిజ సంఘటనల ఆధారంగా ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో ‘అ’ను తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ‘నా డైరీలో లాస్ట్‌ ఎంట్రీ. ఈ రోజు నేనో మాస్‌ మర్డర్‌ చేయబోతున్నా.’ అనే వాయిస్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ప్రతీ పాత్రను వెనుక నుంచీ లేదా, టాప్‌ యాంగిల్‌లో చూపిస్తూ ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఒక్కొక్కరు చెబుతున్న డైలాగ్‌లతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. ప్రతి పాత్ర దేనికదే ప్రత్యేకం అన్నట్లు ఉంది. మరి అసలు వీరందరి వెనుక ఉన్న కథేంటో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకూ వేచి చూడాల్సిందే.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫ్రిబవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నాని ఓ చేపకు వాయిస్‌ ఓవర్‌ అందించగా, రవితేజ ఓ మొక్కకు తన గాత్రాన్ని ఇచ్చారు. మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ త్రిపురనేని నిర్మిస్తున్నారు.

Related Images: