అశ్విన్, జడేజాలకు భారీ షాక్..!

అశ్విన్, జడేజాలకు భారీ షాక్..!

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌లో ఆడనున్న భారత జట్టులో వీరి పేర్లు కనిపించే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. టీమిండియా నయా యువ బౌలర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లు అశ్విన్, జడేజా స్థానాలను వరల్డ్‌కప్‌లో భర్తీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఈ ఇద్దరి వల్ల అశ్విన్, జడేజాలకు ప్రపంచకప్ జట్టులో చోటు అనుమానంగా మారింది. ఒకవేళ చాహల్, కుల్దీప్ యాదవ్‌లు గాయాలబారిన పడి జట్టులో చోటు కోల్పోతే తప్ప అశ్విన్, జడేజాలకు చోటు దక్కే అవకాశమే లేదని మాజీ పేసర్ అతుల్ వాసన్ పేర్కొన్నాడు.

Aswin Jadeja

కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లు బ్రహ్మాండంగా రాణిస్తుండడంతో వీరిద్దరినీ జట్టులో కొనసాగించాలని క్రీడాపండితులు జట్టు మేనేజ్‌మెంట్‌ను కోరుతున్నారు. భారత్ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇటీవల మాట్లాడుతూ అశ్విన్, జడేజాలకు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని పేర్కొన్నాడు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ మాత్రం వన్డేల్లో మణికట్టు స్పిన్నర్ల వైపే మొగ్గు చూపుతున్నాడు. ప్రపంచకప్ జట్టులో వీరిద్దరూ ఉండాల్సిందేనని పట్టుబడుతున్నాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) చైర్మన్ అయిన వాసన్ మాత్రం ఈ ఇద్దరు సిన్నర్లను ప్రపంచకప్‌కు ముందు కనీసం 50 మ్యాచ్‌లైనా ఆడించాలని మేనేజ్‌మెంట్‌ను కోరుతున్నాడు.

Related Images: