సిరియా లో ఆగని దాడులు..వైద్య సేవలకు ఆటంకం

సిరియా లో ఆగని దాడులు..వైద్య సేవలకు ఆటంకం

సిరియాలోని తూర్పు గౌటా ప్రాంతంలో మంగళవారం కూడా కాల్పులు కొనసాగాయి. మానవతా దృక్పథంతో మంగళవారం నుంచి రోజుకు ఐదు గంటలపాటు కాల్పులకు విరామం పాటించాలని సిరియా ప్రభుత్వ  మద్దతుదారైన రష్యా ఇంతకుముందు నిర్దేశించింది. కానీ తొలి రోజే కాల్పులు జరిగాయి.

Syria bomb attack

రాజధాని డమాస్కస్‌కు సమీపానగల తూర్పు గౌటా ప్రాంతం ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. రష్యా మద్దతున్న బషర్ అల్-అసద్ ప్రభుత్వం దీనిని తిరిగి తన నియంత్రణలోకి తెచ్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది.

మంగళవారం తూర్పు గౌటాలో ప్రభుత్వం వైమానిక దాడులు, శతఘ్నుల దాడులు జరిపిందని సహాయక చర్యల్లో పాల్గొంటున్న స్వచ్ఛంద కార్యకర్తలు తెలిపారు. రష్యా స్పందిస్తూ- తూర్పు గౌటాలోని ప్రజలు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు వీలుగా కొన్ని ప్రదేశాల్లో కాల్పులు జరపొద్దని నిర్ణయించామని, కానీ తిరుగుబాటుదారులు అక్కడ దాడులు జరిపారని పేర్కొంది.

Syria bomb attack

తూర్పు గౌటాలో దాడుల వల్ల ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలోని బాధిత ప్రజలకు సహాయం అందించడం వీలు కాలేదు. వైద్యసేవలు అవసరమైనవారిని అక్కడి నుంచి తరలించడం కూడా సాధ్యం కావడం లేదు.

తూర్పు గౌటా ప్రాంతంలో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారు, తీవ్రగాయాలైనవారు వెయ్యి మందికి పైనే ఉన్నారని, వారిని చికిత్స కోసం సత్వరం అక్కడి నుంచి తరలించాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) చెప్పింది.

Syria bomb attack

తూర్పు గౌటాలో సుమారు 3.93 లక్షల మంది చిక్కుకుపోయి ఉన్నారు. కాల్పుల విషయంలో ఇంతకుముందుతో పోలిస్తే మంగళవారం పరిస్థితి మెరుగ్గానే ఉంది.

ఈ ప్రాంతాన్ని తన అధీనంలోకి తెచ్చుకొనేందుకు సిరియా ప్రభుత్వం తొమ్మిది రోజుల క్రితం దాడులను తీవ్రతరం చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మంది చిన్నారులు సహా 500 మందికి పైగా చనిపోయారని సహాయ చర్యలు చేపడుతున్న కార్యకర్తలు తెలిపారు.

Syria bomb attack

సిరియా వ్యాప్తంగా 30 రోజులపాటు కాల్పుల విరమణ పాటించేలా సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ను ఒప్పించాలని రష్యాను ఫ్రాన్స్ కోరింది.

దేశవ్యాప్తంగా కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శనివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే కాల్పుల విరమణను ఏ తేదీ నుంచి పాటించాలనేది స్పష్టం చేయలేదు.

Syria bomb attack

ఇద్దరు పౌరుల మృతి

తిరుగుబాటుదారుల నియంత్రణలోని డౌమా పట్టణంలో కాల్పుల్లో ఒక పౌరుడు చనిపోయారని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్’ తెలిపింది. జిస్రిన్‌ పట్టణంలో శతఘ్నుల దాడుల్లో ఒక చిన్నారి చనిపోయినట్లు పేర్కొంది. అక్కడ ఏడుగురు గాయపడ్డారని చెప్పింది.

తూర్పు గౌటాలో తిరుగుబాటుదారులు మోర్టారు దాడులు జరిపారనే ఆరోపణలను ఈ ప్రాంతంలో ప్రాబల్యమున్న తిరుగుబాటు గ్రూపులు జయ్ష్ అల్-అస్లాం, ఫేలక్ అల్-రహ్మాన్ ఖండించాయి. సిరియా సైన్యం స్పందిస్తూ- తాము వైమానిక దాడులు జరపలేదని తెలిపింది.

Syria bomb attack

Related Images: