శ్రీదేవి నిజాయితీకి ఆశ్చర్యపోయా: సరోజ్‌ఖాన్‌

శ్రీదేవి నిజాయితీకి ఆశ్చర్యపోయా: సరోజ్‌ఖాన్‌

అతిలోక సుందరి శ్రీదేవికి హిందీ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ఖాన్‌ మంచి స్నేహితురాలు. శ్రీదేవి ఈలోకం విడిచి వెళ్ళడంతో ఆమెతో తన అనుబంధాన్ని సరోజ్‌ఖాన్‌ గుర్తు చేసుకున్నారిలా….సుభాష్‌ ఘయ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘కర్మ’ చిత్రంలో ‘మైనే రబ్‌ సే తుఝే..’ పాట కొరియోగ్రఫీ సమయంలో శ్రీదేవిని తొలిసారి కలిశా. తను వేసే స్టెప్పులు సౌతిండియన్‌ స్టైల్‌లో ఉండేవి. దాంతో కొన్ని రీటేక్స్‌ తప్పలేదు. కానీ, డ్యాన్స్‌ బాగా చేసేది. పాట చిత్రీకరణలో తనకు తానుగా ఒకసారి నా దగ్గరకు వచ్చి ‘సరోజ్‌జీ… ప్లీజ్‌ గివ్‌ మి మోర్‌ రిహార్సిల్స్‌ (నాతో ఎక్కువ రిహార్సిల్స్‌ చేయించండి). ఐయామ్‌ నాట్‌ ఎ గుడ్‌ డ్యాన్సర్‌ (నేను మంచి డ్యాన్సర్‌ని కాదు!)’ అని చెప్పింది. తన నిజాయితీ చూసి నేను ఆశ్చర్యపోయా. ఆర్టిస్టులు ఎవరూ తాము సరిగా చేయలేమని చెప్పుకోరు. తర్వాత మేము మంచి స్నేహితులయ్యాం. శ్రీదేవితో సాంగ్‌ షూటింగ్‌ ఉంటే… నాకు ఓ ముద్దు వచ్చేది. సెట్‌లో అడుగు పెట్టగానే ‘హల్లో సరోజ్‌’ అని గట్టిగా కౌగింలించుకుని ఒక ముద్దు పెట్టుకునేది. నేనంటే తనకు అంత ఇష్టం.

saroj-khan-with-sridevi-

నాకు బాగా గుర్తు… ఒకసారి న్యూ ఇయర్‌ పార్టీకి నన్ను, నా దగ్గర పని చేసి ఆరుగురు డ్యాన్సర్లను మద్రాస్‌లోని వాళ్ళింటికి పిలిచింది. తనే ఫ్లైట్‌ టికెట్స్‌ పంపింది. మా ఆతిధ్యం మద్రాస్‌లోని వాళ్ళింటిలోనే. ఉదయం నిద్రలేవగానే నా తలదిండు పక్కన ఒక నగల పెట్టి ఉంది. నిద్ర లేచి చూడగానే నాకు భయం వేసింది. వేరే గదితో పడుకున్నానేమో అనుకున్నా. వెంటనే వాళ్ళమ్మగారు కనిపించారు. విషయం చెప్పాను. ‘శ్రీ’ (శ్రీదేవి) నీకోసమే ఆ నగలు అక్కడ పెట్టారని చెప్పారు. అందులో డైమండ్‌ జ్యువెలరీ ఉంది. అలాగే, నా డ్యాన్సర్లు ఒక్కొకరికీ రూ. 11 వేలు ఇచ్చింది. పెళ్ళి చేసుకుని ఇండస్ట్రీని వదిలి వెళ్ళిన తర్వాత కలవడం తగ్గింది. ఒకసారి నేను కారులో వెళ్తుంటే ఆపింది. ఏంటని నేను కిందకు దిగితే.. తన పిల్లలు ఇద్దర్నీ నాకు పరిచయం చేసింది. తనెప్పుడు కలిసినా… ఎదుటివ్యక్తిని పలకరించే ఆప్యాయత మారదు.

Related Images: