అవార్డును అంకితం ఇచ్చిన రషీద్‌ఖాన్‌

అవార్డును అంకితం ఇచ్చిన రషీద్‌ఖాన్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ తాను అందుకున్న మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును కొద్ది రోజుల క్రితం బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్‌లో భాగంగా క్వాలిఫయర్‌-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలుపులో రషీద్‌ ఖాన్‌ కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ రాణించాడు. 10 బంతుల్లో 34 పరుగులు చేయడంతో పాటు 4ఓవర్లలో మూడు కీలక వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును కైవసం చేసుకున్నాడు. అవార్డు అందుకున్న అనంతరం రషీద్‌ మాట్లాడుతూ.’బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ మూడు విభాగాల్లో వంద శాతం కృషి చేసేందుకు ప్రయత్నించాను. చివర్లో బ్యాటింగ్‌లో రాణించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను అందుకున్న ఈ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అఫ్గానిస్థాన్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితమిస్తున్నాను’ అని రషీద్ ఖాన్‌ ప్రకటించాడు. 
ఇటీవల అఫ్గానిస్థాన్‌లోని ఓ క్రికెట్‌ మైదానంలో జరిగిన బాంబు పేలుళ్లలో 8మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Related Images: