దేశం దృష్టంతా పోలవరం వైపే:  చంద్రబాబు

దేశం దృష్టంతా పోలవరం వైపే: చంద్రబాబు

దేశం మొత్తం పోలవరం ప్రాజెక్టు వైపు చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం ఉదయం నీరు-ప్రగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరి దృష్టి తమ ప్రాజెక్టుల నిర్మాణంపైనే ఉందని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకమైన మైలురాళ్లను అధిగమిస్తున్నామని, డయా ఫ్రం వాల్ నిర్మాణం 414 రోజుల్లోనే పూర్తిచేయడం ఒక చరిత్ర అని చెప్పుకొచ్చారు. 24 గంటల్లో 11,158 క్యూ.మీ. కాంక్రీట్ వేయడం రికార్డు అని అభినందించారు. 42 గంటల్లో 19,500 క్యూ.మీ కాంక్రీట్ అధిగమించాలని సూచించారు. ఇదే స్ఫూర్తితో ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం పనులు కూడా వేగవంతం చేయాలని అధికారులకు తెలిపారు. కాఫర్ డ్యాం పనులు జెట్ గ్రౌటింగ్ విధానంలో పూర్తి చేస్తున్నామని బాబు చెప్పారు.

పోలవరం పూర్తిచేయడం తామందరి సంకల్పమని పేర్కొన్నారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ రూపొందించడం తమ లక్ష్యమన్నారు. గండ్లు పడకుండా అన్నిచెరువులు కాపాడుకోవాలని అధికారులకు చెప్పారు. కట్టల పటిష్టం, కంప నరికివేత పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రతి ఊళ్లో ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వగలగాలని సీఎం అన్నారు. లోటు వర్షపాతంలో కూడా 2.21 మీటర్లు భూగర్భజలం పెరిగిందని చెప్పారు. నీరు-ప్రగతి, నీరు-చెట్టు పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. వానాకాలంలో 3 మీ., వేసవిలో 8మీ.లోతున భూగర్భజలాలు ఉండాలని అధికారులకు చంద్రబాబు తెలిపారు.

ఈ నెలలో నరేగా పనులు మరింత చురుకుగా జరగాలన్నారు. పంట కుంటల తవ్వకం పనులు ముమ్మరంగా జరగాలని అన్నారు. నీరు, పచ్చదనంతోపాటు పరిశుభ్రత పెరగాలన్నారు. ఓడీఎఫ్ స్ఫూర్తితో ఓడీఎఫ్ ప్లస్ కూడా విజయవంతం చేయాలని సీఎం పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న 4,500వర్క్ షెడ్లు వెంటనే పూర్తిచేయాలన్నారు. మరో 6వేల వర్క్ షెడ్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతులకు అన్నిరకాల ఇన్ పుట్స్ అందజేయాలన్నారు. తెగుళ్ల గురించి ముందస్తు అంచనా వేయాలని, ఇస్రో, ఆర్టీజీ సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు తెలిపారు.

గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. మెషీన్ కటింగ్ వల్ల తేమ 17%కంటే ఎక్కువ ఉండటం సహజమని, దానిని అడ్డం పెట్టుకుని రైతులకు ధర తగ్గించడం సరికాదన్నారు. తేమసాకుతో వ్యాల్యూ కట్ చేస్తే సహించేదిలేదని సీఎం స్పష్టం చేశారు. వర్షాలకు అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. అందరికీ రక్షిత మంచినీటిని సరఫరా చేయాలన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్యశాఖలు సమన్వయంగా పనిచేయాలన్నారు. చిన్నారులందరికీ త్వరలోనే హెల్త్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

Related Images: