నా.. నువ్వే మూవీ రివ్యూ

నా.. నువ్వే మూవీ రివ్యూ

ఇటీవల కాలంలో విలక్షణ పాత్రలతో, విభిన్నమైన చిత్రాలతో అలరిస్తున్నారు హీరో నందమూరి కల్యాణ్ రామ్. ఆయన నటించిన ఎమ్మెల్యే చిత్రంతో మంచి సక్సెస్ సాధించారు. యాక్షన్ హీరోగా ముద్ర వేసుకొన్న కల్యాణ్ రామ్ రూట్ మార్చి అందమైన ప్రేమకథా చిత్రం నా నువ్వేతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాడ్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర రూపొందించిన ఈ చిత్రంలో ఆయనకు జంటగా తమన్నా భాటియా నటించారు. పీసీ శ్రీరాం ఈ ప్రేమకథను అందంగా మలిచేందుకు ప్రయత్నించారని బలంగా సినీ వర్గాల్లో వినిపించింది. లవర్ బాయ్ ఇమేజ్‌తో 14వ తేదీన ముందుకు వచ్చిన కల్యాణ్ రామ్ ప్రేక్షకులను మెప్పించారా అని తెలుసుకోవాలంటే నా నువ్వే కథేంటో తెలుసుకోవాల్సిందే.

నా.. నువ్వే కథ

మీరా (తమన్నా భాటియా) రేడియో జాకీ. వరుణ్ (కల్యాణ్ రామ్) అమెరికాకు వెళ్లాలనుకొనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీరిద్దరి ప్రేమకు లవ్ సైన్ అనే పుస్తకం బీజం వేస్తుంది. వరుణ్ ఫోటోను చూసిన వెంటనే అతడిని తన లక్కీగా భావిస్తుంది. తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోతుంది. ఇలా తన మనసులో ఉన్న ప్రియుడి గురించి వెతుకులాట ప్రారంభిస్తుంది. వెతికే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అమెరికాకు వెళ్లడానికి వరుణ్‌కు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది.

kalyan ram look

డెస్టినీకి పరీక్ష

చివరకి మీరా, వరుణ్ కలుసుకొన్నారా? తనలోని ప్రేమను వరుణ్‌కు మీరా ఎలా వ్యక్తపరిచారు? ఎలాంటి అడ్డంకులు లేకుండా వారి ప్రేమ ముందుకెళ్లిందా? వారి ప్రేమకు ఎవరు అడ్డంకిగా నిలిచారు? వరుణ్ అమెరికాకు ఎందుకు వెళ్లలేకపోయారు? ఇలాంటి పరిస్థుతుల్లో వారి ప్రేమను ఎలా గెలుచుకొన్నారు? డెస్టినీ వారి ఎలా ఒక్కటి చేసింది అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే నా నువ్వే చిత్ర కథ.

naa nuvve tamannah

జయేంద్ర డైరెక్షన్

నా నువ్వే దర్శకత్వం వహించడానికి ముందు డైరెక్టర్ జయేంద్ర ఓ యాడ్ ఫిల్మ్ మేకర్. మాస్ ఇమేజ్ ఉన్న కల్యాణ్ రామ్‌ను లుక్ పరంగా పూర్తిగా మార్చివేసి లవర్ బాయ్ ఇమేజ్‌లోకి తీసుకెళ్లాడు. తమన్నా గ్లామర్‌ను జోడించి అందమైన ప్రేమకథను అల్లుకొన్నారు. అయితే కథలో బలమైన పాయింట్ లేకపోవడం, కథ గమనం కూడా సరిగా లేకపోవడం ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా చూపించాలనే తపనతో కథ, కథనాలు పెద్దగా పట్టించుకోలేదా అనే ప్రశ్న తొలి అరగంటలోనే ప్రేక్షకుడిని బుర్రను తొలిచేస్తుంది. కొన్ని ఫీల్ గుడ్ సీన్లు ప్రేక్షకుడిని ఆకట్టుకొన్నప్పటికీ సినిమాను మరోస్థాయి చేర్చేంత విషయం లేకపోవడం ప్రధాన లోపంగా మారిందని చెప్పవచ్చు. ఓవరాల్‌గా ప్రేక్షకుడు ‘నా నువ్వే’ అనుకునే రేంజ్‌లో సినిమాను తెరకెక్కించలేకపోవడం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

kalyan ram and tamannah

కల్యాణ్ రామ్ ఫ్రెష్ లుక్‌

కల్యాణ్ రామ్ చాలా ఫ్రెష్‌గా, కొత్తగా తెర మీద కనిపించారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కథను తన భుజాన మోసుకెళ్లేంత దమ్ము వరుణ్ పాత్రలో లేకపోవడంతో ఆకట్టుకోలేకపోయారు. ఫైట్స్, ఎమోషన్స్, డాన్సులు చేయడం కల్యాణ్ రామ్ కొత్తేమీ కాదు. కానీ కథ, పాత్రలో బలం ఉంటే అవన్నీ సినిమాకు ప్లస్ అవుతాయి. నా నువ్వేలాంటి ప్రేమ కథలో భావోద్వేగాలకు చోటు లేకపోవడంతో కల్యాణ్ రామ్ పాత్ర తేలిపోయినట్టు కనిపిస్తుంది. కల్యాణ్ రామ్‌ చేసిన ప్రయత్నం మంచిదే కానీ దానికి సరిపడా సరంజామాను చూసుకోకపోవడం మైనస్‌గా కనిపిస్తుంది.

tamannah

తమన్నా మరింత గ్లామరస్‌గా

మీరా పాత్రలో తమన్నా గ్లామర్‌గా కనిపించింది. పూర్తిగా సినిమా అంతా తనపైనే నడుస్తుంది. రేడియో జాకీగా అందంగా కనిపించింది. కొన్ని సీన్లలో ఎమోషన్స్‌ను బాగానే పండించింది. కల్యాణ్ రామ్‌తో రొమాంటిక్ సీన్లు ఎక్కువగా లేకపోవడంతో వారి కెమిస్ట్రీకి అంతగా స్కోప్ లేకపోయింది. ఓవరాల్‌గా చాలా రోజుల (బాహుబలి) తర్వాత కథను నడిపించే పాత్రలో తమన్నా కనిపించడం ప్రేక్షకులు ఓ ఊరట అని చెప్పవచ్చు.

కామెడీ ట్రాక్‌

నా నువ్వే చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రవీణ్ లాంటి హాస్య నటులు ఉన్నా వారి మధ్య వచ్చే సీన్లు అంతగా ఎంటర్‌టైనింగ్ ఉండవు. బిత్తిరి సత్తి కామెడీ ట్రాక్ బెడిసి కొట్టింది. రొటిన్ కామెడీతో నెట్టుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఇక తమన్నా తండ్రిగా తనికెళ్ల భరణి, తల్లిగా సురేఖ వాణి, మరో ప్రధాన పాత్రలో పోసాని కృష్ణ మురళి అప్పడప్పుడు తమదైన మార్కులో నటనను ప్రదర్శించారు.

పీసీ శ్రీరాం సూపర్

నా నువ్వే సినిమాకు వెన్నముక పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫి. సినిమా తొలి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు ప్రతీ సన్నివేశంగా అందంగా కనిపిస్తుంది. లైటింగ్, ఏరియల్ షాట్స్ ఆకట్టుకొనేలా ఉంటాయి. ఇలాంటి అంశాలు సినిమాకు బలమని చెప్పే పరిస్థితి ఉంది. కానీ సినిమాను మరోస్థాయికి చేర్చే కథ, ఫీల్ లేకపోవడంతో అవన్నీ మరుగునపడిపోవడానికి అవకాశం ఏర్పడింది. గ్రాఫిక్స్ బాగున్నాయి.

  naa nuvve  

ఆకట్టుకోలేని మ్యూజిక్…

నా నువ్వే చిత్రానికి శరత్ సంగీత దర్శకత్వం వహించారు. కానీ ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చే విధంగా మ్యూజిక్ ఉంది. స్వయంగా దర్శకుడు యాడ్ ఫిలిం మేకర్ కావడం వల్లనో ఏమో తెర మీద పాటలు కూడా అలానే ఫిలింగ్‌ను కలుగజేస్తాయి. ఒకట్రెండు పాటల చిత్రీకరణ తెర మీద మ్యాజిక్ అనిపించేలా ఉంటాయి.

నిర్మాణ విలువలు…

నా నువ్వే చిత్రానికి మహేష్‌ ఎస్‌. కోనేరు, విజయ్‌ కుమార్‌ వట్టికూటి, కిరణ్ ముప్పవరపు నిర్మాతలు. సినిమాను చాలా రిచ్‌గా రూపొందించేందుకు పడిన కష్టం తెర మీద కనిపిస్తుంది. అదే రేంజ్‌లో కథ, కథనాలపై మరికొంత దృష్టిపెట్టి ఉంటే ప్రేక్షకులను మ్యాజిక్ చేసే ఓ ఫీల్ గుడ్ చిత్రంగా రూపొందే అవకాశం ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Related Images: