సమ్మోహనం మూవీ రివ్యూ..!

సమ్మోహనం మూవీ రివ్యూ..!

అష్టాచెమ్మా, జెంటిల్ మేన్, అమీతుమీ వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సారి ఎమోషనల్ లవ్ డ్రామాను తెరకెక్కించారు. సుధీర్ బాబు హీరోగా, అదితిరావ్ హైదరీ హీరోయిన్ గా మంచి టైటిల్ ” సమ్మోహనం “ తో సరికొత్త ప్రేమ కథాచిత్రాన్నిఅందించారు. తెలుగు రాని హీరోయిన్, ఆమెకు తెలుగు నేర్పే వ్యక్తిగా హీరో చేసిన ప్రయత్నాలు, సినిమావాళ్ళ కష్టాలు, కాస్తంత కామెడీ జోడించి ఈ సినిమాను ఇంద్రగంటి తీర్చిదిద్దాడు. సమ్మర్ ముగుస్తున్న ఈ సీజన్ లో సమ్మోహనం నిజంగా ఆడియెన్స్ ని సమ్మోహనపరిచిందా లేదా తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాల్సిందే..

సినిమా పేరు : సమ్మోహనం
తారాగణం : సుధీర్ బాబు, అదితిరావ్ హైదరీ, సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్ తదితరులు
సంగీతం : వివేక్ సాగర్
దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
విడుదల : 15.6.18

కథ : ఆర్. విజయకుమార్ అలియాస్ విజ్జు (సుధీర్ బాబు) కు సినిమాలంటే ఇష్టం ఉండదు. బొమ్మలతో చిన్న పిల్లల కథల పుస్తకం రచిస్తుంటాడు. అయితే అతని తండ్రి సర్వేష్ ( సీనియర్ నరేష్) కి మూవీలంటే చాలా ఇష్టం. వాటిమీద ఆసక్తితో తన ఇంటిని ఓ సినిమా షూటింగ్ కోసం అనుమతిస్తాడు. అయితే అందులో నటించేందుకు తనకూ ఛాన్స్ ఇవ్వాలని కోరుతాడు. ‘ కుమ్మేస్తా ‘ అనే కామెడీ చిత్రం యూనిట్ ఇందుకు సరేనంటుంది.ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా హీరోయిన్ సమీర రాథోడ్ (అదితి రావ్ హైదరీ) తో విజ్జు లవ్ లో పడతాడు. ఆమెకు తెలుగు సరిగా రాకపోవడంతో తానే ఆమెకు నేర్పించే ప్రయత్నం చేస్తాడు. షూటింగ్ తరువాత సమీర కులూ మనాలీ వెళ్ళిపోతుంది. ఆమెను మరిచిపోలేని విజ్జు అక్కడికి వెళ్లి తన ప్రేమను వ్యక్తపరిచినప్పటికీ సమీర నిరాకరిస్తుంది. అయితే చివరకు ఏం జరుగుతుంది ? అతని ప్రేమను ఆమె అంగీకరిస్తుందా ? ఇద్దరూ ఒక్కటవుతారా ? వీరి ప్రేమ చివరకు ఏ మలుపు తిరిగి శుభం కార్డు పడుతుంది అన్న విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.

విజ్జు రోల్ లో సుధీర్ బాబు ఒదిగిపోయాడు.లవర్ బాయ్ గా బాగా నటించాడు. తెలుగు రాని నటిగా అదితిరావ్ హైదరీ నటనకు మంచి మార్కులే పడతాయి. సీనియర్ నరేష్ కామెడీ పండింది. హీరో తండ్రి పాత్రలో మంచి నటన కనబరిచాడు. లీడ్ ఆర్టిస్టుల నటన, వివేక్ సాగర్ సంగీతం, డైలాగులు ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు కాగా.. అక్కడక్కడ నెమ్మదిగా సాగిన కథనం మైనస్ పాయింట్ అయింది. ఎడిటింగ్ లో కాస్త శ్రద్ధ చూపాల్సింది. ఇంద్రగంటిమోహనకృష్ణ ఒక చక్కని కథను ఎంపిక చేసుకుని, హీరో హీరోయిన్లను బాగా హైలైట్ చేయగలిగాడు.