ఈ నగరానికి ఏమైంది ? మూవీ రివ్యూ

ఈ నగరానికి ఏమైంది ? మూవీ రివ్యూ

పెళ్లి చూపులు ‘ మూవీతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ మరో వెరైటీ సినిమాను తెరకెక్కించాడు. పూర్తిగా యువతను దృష్టిలో పెట్టుకుని ఓ కథను కాన్సెప్ట్ గా తీసుకుని ‘ ఈ నగరానికి ఏమైంది ” చిత్రం తీశాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అయిన ఈ చిత్రంతో తరుణ్ మళ్ళీ తన ప్ర్రత్యేకతను చాటాడు. కొత్త నటులతో ఆయన చేసిన ప్రయోగం సక్సెస్ అయిందా ? నిర్మాత సురేష్ బాబు సంస్థనుంచి ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకుందా అన్న విషయాలు తెలుసుకోవాలంటే బ్రీఫ్ గా కథలోకి వెళ్ళాల్సిందే.

సినిమా పేరు : ఈ నగరానికి ఏమైంది ?
తారాగణం : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గొమతం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి
సంగీతం : వివేక్ సాగర్
దర్శకత్వం : తరుణ్ భాస్కర్
నిర్మాత : డి. సురేష్ బాబు
విడుదల : 29.6.18

కథ : విష్వక్సేన్ నాయుడు (వివేక్), సుశాంత్ రెడ్డి (కార్తీక్), అభినవ్ గొమతం (కౌశిక్), వెంకటేష్ కాకుమాను (ఉపేంద్ర) మంచి ఫ్రెండ్స్. చిన్నప్పటినుంచి కలిసి చదువుకుంటారు. వీరి లక్ష్యం ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలన్నదే. ఆ ప్రయత్నాల్లో ఉండగా వివేక్ ప్రేమలో పడతాడు. అయితే అతని భయాన్ని చూసి అతని గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పడంతో మందు కొట్టడం ప్రారంభిస్తాడు. కార్తీక్ ఓ పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకొనే ఆలోచనలో ఉంటాడు.

కౌశిక్ డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తుంటే ఉపేంద్ర పెళ్లి క్యాసెట్లు ఎడిటింగ్ చేసే పనిలో బిజీగా ఉంటాడు. తనకు పెళ్లి కుదిరిన సందర్భంగా కార్తీక్ ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తాడు. అయితే ఆ పార్టీలోనే రింగ్ పోగొట్టుకుంటాడు. తాగిన మత్తులో ఉన్న ఈ స్నేహితులు గోవా చేరుకుంటారు. అలా అక్కడికి చేరుకున్న వీరు ఏం చేశారు ? ఖరీదైన రింగ్ కొనేందుకు వారు చేసిన ప్రయత్నాలేమిటి ? ఈ ట్రిప్ తర్వాత వాళ్ళు ఎలా మారిపోయారు ? షార్ట్ ఫిల్మ్ తీస్తారా ? చివరికి తీశారా ..లేదా ? ఇవన్నీ సెకండాఫ్ లో చూడాల్సిందే.

విశ్లేషణ : నలుగురు కుర్రాళ్ళ కథే ఇది ! అక్కడక్కడ వీరి కష్టాలు, కామెడీ డైలాగులు , సరదాగా మద్యం తాగినప్పుడు వారి ప్రవర్తనను దర్శకుడు హ్యూమరస్ గా చూపగలిగాడు. సినిమా అంతా ఈ నలుగురు కుర్రాళ్ళ చుట్టే తిరుగుతుంది. కొత్త నటులను ఎంచుకున్న తరుణ్ భాస్కర్ వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. వివేక్ రోల్ లో విశ్వక్ సేన్ సీరియస్ నెస్ తో బాటు బాధను కూడా చక్కగా చూపగలిగాడు. కౌశిక్ పాత్రలో అభినవ్ గొమతం ఒదిగిపోగా .. ఇతర పాత్రల్లో సుశాంత్ రెడ్డి, ఉపేంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు. శిల్ప రోల్ లో సిమ్రాన్ చౌదరి అందంగా కనిపించగా.. మోడరన్ అమ్మాయిగా అనీషా ఆంబ్రోస్ మెప్పించింది. పాటలు ఫరవాలేదు. లీడ్ యాక్టర్ల నటన ప్లస్ పాయింట్ కాగా.. అక్కడక్కడ మందకొడిగా సాగిన కథనం, తాగుడు సన్నివేశాలు మైనస్ పాయింట్లయ్యాయి. జస్ట్,,యువతకు నచ్చే చిత్రంగా మిగిలిపోయింది.

Related Images: