బిగ్‌షాట్స్‌ నాకు సాయం చేయలేదు..!

బిగ్‌షాట్స్‌ నాకు సాయం చేయలేదు..!

తెలుగులో నటించిన తొలి చిత్రం ‘సమ్మోహనం’తో మంచి విజయం అందుకున్నారు నటి అదితి రావ్‌ హైదరి. సినిమా నేపథ్యానికి చెందని కుటుంబం నుంచి వచ్చి అవకాశాల కోసం ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో ఎందరో పేరు మోసిన బిగ్‌షాట్స్‌ ఉన్నప్పటికీ వారి నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదని అంటున్నారు. ఈ విషయాలన్నీ ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నన్ను ఇండస్ట్రీలో ఇప్పటికీ అండర్‌రేటెడ్‌(తక్కువ స్థాయి)నటిగా భావిస్తున్నారు. అలా అన్నప్పుడు చాలా బాధేస్తుంటుంది. ఇలాంటి విషయాలన్నీ మనసులో పెట్టుకోవద్దని మా అమ్మ నాకు చాలా సార్లు చెప్పింది. అప్పటినుంచి ఎవరైనా నన్ను అండర్‌రేటెడ్‌ అని అంటే దానిని పొగడ్తలా భావించడం మొదలుపెట్టాను. అంటే నేను ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని దాని అర్థం. నా కెరీర్‌ ఇక్కడితోనే ఆగిపోదు.

ఇంకా చాలా జీవితం ఉంది. ఇండస్ట్రీలో బిగ్‌షాట్స్‌ ఉన్నారు కానీ వారు నా కెరీర్‌లో ఎలాంటి సాయం చేయలేదు. కాబట్టి అవకాశాల కోసం నేనే కష్టపడుతూ ఉండాలి. నా కెరీర్‌లో నాకు నచ్చిన దర్శకులతోనే కలిసి పనిచేశాను.

కానీ ఇప్పటికీ అవకాశాల కోసం కష్టపడుతూనే ఉండాల్సిన పరిస్థితి. నాకు నచ్చిన పని దక్కాలంటే ఓపికగా ఎదురుచూడాలి’ అన్నారు. అనంతరం తనకు నచ్చిన దర్శకుల గురించి మాట్లాడుతూ..’నాకు మణిరత్నం సర్‌ అంటే చాలా ఇష్టం. నేను చేసే ప్రతీ సినిమాకు ఆయనే దర్శకుడిగా ఉండాలని అశపడుతున్నాను.

నాకు సంజయ్‌ లీలా భన్సాలీతో కలిసి మరోసారి పనిచేయాలని ఉంది. విశాల్‌ భరద్వాజ్‌, అనురాగ్‌ బసు, అనురాగ్‌ కశ్యప్‌, అశ్విని అయ్యర్‌, శూజిత్‌ సర్కార్‌..వీరందరితో కలిసి పనిచేయాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గొప్ప దర్శకులు మంచి కళాకారులు కూడా. దేనినైనా సృజనాత్మకంగా తెరకెక్కించాలని అనుకుంటారు.

దాని వల్ల డబ్బు రావచ్చు, రాకపోవచ్చు. కానీ వారు తీసే సినిమాలు మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి.’ అని పేర్కొన్నారు అదితి. ప్రస్తుతం ఆమె మరో తెలుగు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో సాగే కథలో ఆమె నటిస్తున్నారు.

ఇందులో వరుణ్ తేజ్‌ కథానాయకుడుగా నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి మరో కథానాయికగా నటిస్తున్నారు.

Related Images: