జనసేనలోకి ఇద్దరు మంత్రులు..!

జనసేనలోకి ఇద్దరు మంత్రులు..!

ఎన్నికల ముంగిట ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో మంది ఎక్కువగా ఉండడం, నియోజకవర్గాల పెంపు లేకపోవడంతో ఈ పార్టీలోని కీలక నేతలు తమకు నచ్చిన పార్టీలోకి జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు సైతం ఇలానే పక్క చూపులు చూస్తున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఎన్నికలకు మరో పదిమాసాల గడువు ఉన్నప్పటికీ.. నేతలు ఇప్పటి నుంచే తమ టికెట్లను రిజర్వ్ చేసుకుంటున్నారు.

నిజానికి గత ఎన్నికల నాటి పరిస్థితి ఇప్పుడు ఏపీలో కనిపించడం లేదు. అప్పట్లో చంద్రబాబుకు బలమైన పక్షంగా ఉన్నారు. ఒకవైపు బీజేపీ,మరోవైపు జనసేనాని పవన్‌లు ఆయనను బలపరిచారు. దీంతో అప్పటి ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు నల్లేరుపై నడకగానే సాగిపోయింది. అయితే, వచ్చే ఎన్నికల్లో పరిస్థితి దారుణంగా ఉంది. చంద్రబాబుతో కలిసి వచ్చేందుకుఏ పార్టీ కూడా సిద్ధంగా లేకపోవడం గమనార్హం. దీంతో బాబు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాల్సిన అగత్యం ఏర్పడింది. అయితే, ఆయనకు రెండు పరిస్థితులు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి.

ఒకటి.. సొంత తమ్ముళ్ల అవినీతి, రెండు.. విభజనచట్టంలోని హామీలను సాకారం చేసుకోలేక పోవడం. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలు.. దీపం ఉండగానే చక్కబెట్టుకునే రీతిలో తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేనలోకి జంప్ అవ్వటానికి ఇద్దరు మంత్రులు రెడీ అయ్యారని తెలుస్తోంది. వారు ఇప్పటికే తమ సీట్ల విషయానికి సంబంధించి జనసేనాని నుంచి తగిన విధంగా హామీ పొందారని సమాచారం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. వారు జనసేన జెండాపై గెలిచేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

జంప్ అయ్యే మంత్రులు ఒకరు రాజధాని ప్రాంతానికి చెందిన వారు కాగా..మరొకరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. మంత్రులతోపాటు కొద్ది రోజుల క్రితం వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు కూడా కొంత మంది జనసేనకు టచ్ లో ఉన్నారు. మరి వీరు కూడా తమ అవకాశం చూసుకుని పార్టీ నుంచి ఫిరాయించడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ విషయంలో బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఏదేమైనా రాజకీయ నేతలు ఎటైనా బెండ్ అవగల సమర్థులు!!

Related Images: