జనసేనలోకి చిరు… చక్రం తిప్పింది ఎవరంటే…!

జనసేనలోకి చిరు… చక్రం తిప్పింది ఎవరంటే…!

ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా ఉన్న మాజీ కేంద్రమంత్రి చిరంజీవి త్వరలోనే తన తమ్ముడు ప్రారంభించిన జనసేన పార్టీలోకి చేరనున్నారా? ప్రస్తుతం జరుగుతున్న సైరా సినిమా ముగియగానే.. ఆయన దీనిపై తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడా? అంటే.. తాజా పరిణామాలు ఔననే అంటున్నాయి. ప్రస్తుతం ఇంకా కేడర్‌ను పూర్తి నింపుకోని జనసేనాని పవన్ కళ్యాణ్‌.. తాజాగా చిరు ఫ్యామిలీ అభిమానులను తన పార్టీలోకి ఆహ్వానించారు. వీరు భారీ ఎత్తున ఇప్పుడు జనసేన తీర్థం పుచ్చుకో నున్నారు. అయితే, దీని వెనుక మెగా బ్రదర్ నాగబాబు, అదేవిధంగా చిరు కూడా చక్రం తిప్పారని తాజా సమాచారం. చిరంజీవిప్రమేయం లేకుండా చిరు అభిమాన సంఘాలు గుండుగుత్తుగా జనసేనలోకి వెళ్లే ప్రసక్తే ఉండదు.

సో.. ఇప్పుడు వారంతా జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు అంటే.. తెరవెనుక చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే చెప్పొచ్చు. 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీలో కొందరు చేరారు. మరికొందరు చిరంజీవితో పాటే కాంగ్రెస్‌లో కొనసాగారు. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. మరోవైపు జనసేనాని వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. రమణం స్వామినాయుడు నేతృత్వంలో మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు ఇవాళ పవన్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు.

మెగా హీరోస్ అభిమాన సంఘాల నేతల్ని హైదరాబాద్ రావాల్సిందిగా జనసేనాని ఆహ్వానించడంతో గచ్చిబౌలిలో సందడి నెలకొంది. స్వామినాయుడు ఆధ్వర్యంలో వారంతా హైదరాబాద్ తరలివచ్చారు. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమణం స్వామినాయుడు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం టిక్కెట్‌పై రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన స్వామినాయుడు ఆ తరువాత చిరంజీవితో పాటు కాంగ్రెస్‌లో చేరారు. ఈయన చేరిక పూర్తిగా చిరు కనుసన్నల్లోనే సాగుతోందని ఫ్యాన్సే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఒకటి రెండు నెలల ముందుగా చిరంజీవి కూడా తమ్ముడు పార్టీకి జైకొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక, ఇప్పటికే బాబాయి ఓకే అంటే తానూ జనసేన జెండా మోస్తానని అబ్బాయి.. చెర్రీ ఇప్పటికే ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో జనసేనలో చిరంజీవి బృందం మొత్తంగా అరంగేట్రం చేయడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. రాజకీయాల్లోఏదైనా జరగొచ్చు. తానే సీఎంను కావాలని భావించి పార్టీ పెట్టి.. చివరికి దానిని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరుకు ఇప్పుడు పార్టీ మార్పు అంత పెద్ద సమస్య కాదని అంటున్నారు పరిశీలకులు. అయినా రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. చిరు మాత్రం వెనక్కి తగ్గుతారని ఎలా ఊహిస్తాం!!

Related Images: