మొన్న కత్తి..నేడు పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ..!

మొన్న కత్తి..నేడు పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ..!

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ హిందువులు ఎంతో భక్తితో కొలిచే శ్రీరాముడు, సీతమ్మ లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పెద్ద సంచలనం జరిగింది. దాంతో కత్తిని తెలంగాణా నుంచి బహిష్కరించారు. అయితే కత్తిపై నిరసనగా పరిపూర్ణానంద స్వామి ర్యాలీ నిర్వహిస్తానని చెప్పడంతో ఆయనను హౌజ్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే..శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఆయన్ను ఆరు నెలల పాటు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

పోలీసుల అనుమతి లేకుండా నగరంలోకి పరిపూర్ణానంద ప్రవేశించే వీలు లేదని, ఈ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయనకు నగర బహిష్కరణ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా.. ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. ఈరోజు తెల్లవారుజామున నగరం నుంచి తరలించారు.

 

ఆయనను తరలించడంలో పోలీసులు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించినట్లు సమాచారం. కొన్ని వాహనాలను ఒకవైపు, మరికొన్ని వాహనాలను మరోవైపు పంపినట్లు తెలుస్తోంది. ఆయన స్వస్థలమైన కాకినాడుకు తరలిస్తారో.. మరో చోటుకి తరలించారో అన్న విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉండడం వల్లే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పరిపూర్ణానంద స్వామికి నగర బహిష్కరణ నోటీసులు అందినట్లు న్యాయసలహాదారు పద్మారావు కూడా ధృవీకరించారు.