వివాదాస్పదంగా మారిన విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ !

వివాదాస్పదంగా మారిన విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ !

టాప్ యంగ్ హీరోలుగా ఎంతకాలం కొనసాగుతామో తమకే తెలియకపోవడంతో ప్రస్థుత తరం క్రేజీ హీరోలు అంతా సినిమాలు చేస్తూనే ఎదో ఒక స్థిరమైన వ్యాపారాలలో నిలబడటానికి రకరకాల వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. ప్రస్తుతతరం క్రేజీ యంగ్ హీరోగా సంచలనాలు సృష్టిస్తున్న విజయ్ దేవర కొండ అసాంఘీక కార్యకలాపాలకు చిరునామాగా ఉండే ‘రౌడీ’ అనే పదాన్ని తన అభిమాన సంఘాలకు పేరుగా అదేవిధంగా తాను కొత్తగా చేపట్టిన రెడీ మేడ్ అపరల్స్ బిజినెస్ కు బ్రాండ్ నేమ్ గా మార్చుకోవడం ఎంతవరకు సమంజసం అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సినిమా తారలు రచయితలు సమాజానికి సేవ చేయకపోయినా కనీసం వారి ప్రవర్తనలో చూపించే పద్ధతి సమాజంలో యువతకు ఆదర్శవంతంగా ఉండాలని చాలమంది భావిస్తూ ఉంటారు. అయితే ఈవిషయాలను పట్టించుకోకుండా ప్రస్తుతం యూత్ కు ఐ కాన్ గా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ ‘రౌడీ’ పదాన్ని తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి చేస్తున్న ప్రయోగాల పై చాలామంది చాల రకాలుగా విమర్శిస్తున్నారు.

‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ సమయంలో ‘మా’ అంటూ తిట్టును పదే పదే స్టేజ్ మీదే చెప్పి యూత్ కు క్రేజీ స్టార్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ ఇచ్చిన కిక్ తో ప్రస్తుతం వరసపెట్టి సినిమాలు చేస్తూ తన లేటెస్ట్ అపరల్స్ వ్యాపారం కోసం గుండెల మీద ‘రౌడీ’ అని పెద్దగా ముద్రవేసి ఉన్న టి. షర్ట్ లను ప్రమోట్ చేయడం మరీ అతిగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఒక వ్యక్తి పై భారతీయ చట్టాల ప్రకారం రౌడీ షీటర్ అన్న పదంతో కేసులుపడితే ఆ వ్యక్తి కెరియర్ అన్ని విధాలా దిగజారి పోయినట్లు లెక్క.

అయితే అటువంటి అసాంఘీక పదానికి ఇప్పుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా మారుతున్నాడు. తమ అభిమాన హీరోలు ఏమి చేసినా అందులోని అర్ధాలు తెలుసుకోలేని సగటు యువత ఈ ‘రౌడీ’ అన్న పదం ఒక గౌరవంగా భావించే పరిస్థితి ఏర్పడితే రేపటి తరం వారి భవిష్యత్తు ఏమిటీ అనేది సమాధానం లేని ప్రశ్న. ఇప్పటికే నైతిక విలువలు పతనం అయిపోతున్న పరిస్థుతులలో విజయ్ దేవర కొండ తాను ప్రమోట్ చేస్తున్న అపరల్స్ కంపెనీ బ్రాండ్ కు రౌడీ పదం బదులు మరో మంచి పేరు పెడితే బాగుంటుంది అన్న సూచనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ స్టేజ్ షోలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఇలాంటి సూచనల పై దృష్టి పెడతాడా అన్నదే సందేహం..