కరుణానిధి అంత్యక్రియల వివాదం..!

కరుణానిధి అంత్యక్రియల వివాదం..!

మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణవార్తతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. తమ అభిమాన నేత, రాష్ట్రానికి పెద్దదిక్కు లేకుండా పోయారని అభిమానులు, కార్యకర్తలు, నేతలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ రోజు కరుణ అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లలో డీఎంకే నిమగ్నమైంది.

కాగ కరుణానిధి అంత్యక్రియలు చేపట్టాల్సిన స్థలం విషయంలో డీఎంకేకు, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం చెలరేగింది. మెరీనా బీచ్‌లో స్థలమివ్వాలన్న డీఎంకే డిమాండును సర్కారు తోసిపుచ్చింది. దీనిపై డీఎంకే హైకోర్టును ఆశ్రయించగా.. అర్ధరాత్రి న్యాయమూర్తులు విచారించారు. బుధవారం ఉదయం 8 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. ఇతర నేతల అంత్యక్రియలకు స్థలం ఇచ్చినట్టుగానే సీనియర్‌ నేత కరుణానిధికి ఎందుకివ్వకూడదని ప్రశ్నించింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ డీఎంకే.. మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. కరుణానిధి అందించిన సుదీర్ఘ సేవలను దృష్టిలో ఉంచుకొని ఆయన అంత్యక్రియలకు మెరీనాబీచ్‌లో అన్నాదురై సమాధి ప్రాంగణంలో చోటు ఇవ్వాలని స్టాలిన్‌ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పళనిస్వామికి లేఖ రాశారు.

గతంలో ఎం.జి.రామచంద్రన్‌, జయలలితలకు మెరీనా బీచ్‌లో అంత్యక్రియలు జరిగాయి. వారి స్మారకాలనూ ఏర్పాటుచేశారు. కరుణానిధి అంత్యక్రియలకు మెరీనా బీచ్‌లో స్థలమివ్వాలంటూ డీఎంకే కార్యకర్తలు నిరసనకు దిగారు.

Related Images: