వైఎస్ భారతిపై చార్జిషీటు…వైసిపిలో సంచలనం..!

వైఎస్ భారతిపై చార్జిషీటు…వైసిపిలో సంచలనం..!

ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వేసిన ఓ చార్జిషీట్ వైసిపిలో సంచలనం రేపింది. కారణమేమిటంటే ఇడి వేసిన చార్జిషీట్ ఎవరిమీదో కాదు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపైనే. భారతి సిమెంట్స్ లో క్విడ్ ప్రోకో జరిగిందంటూ దాదాపు ఏడేళ్ల క్రితం సిబిఐ, ఇడి రెండు కలిసి కేసులు నయోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. ఆ కేసుకు సంబంధించి మొదటిసారిగా చార్జిఫీటు పడింది భారతిపై. విచిత్రమేమిటంటే, సిబిఐ ప్రత్యేక న్యాయస్ధానంలో విచారణ జరుపుతున్న ఈ కేసులో సిబిఐ మాత్రం ఎటువంటి అభియోగాలు నమోదు చేయకపోయినా ఇడి మాత్రం భారతిని వదలలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజ్యసభ డిప్యుటి ఛైర్మన్ ఎన్నిక ముగిసిన రోజే వైఎస్ భారతిపై ఇడి అభియోగ పత్రాలు నమోదు చేయటం సంచలనంగా మారింది.

జగన్ పై కేసులు నిలిచేవేనా ?

ఒకవైపేమో జగన్ పై నమోదైన కేసుల్లో ఎందులోనూ సరైన ఆధారాలు చూపలేకపోతున్నాయన్న కారణంతో సిబిఐ కోర్టు కావచ్చు హై కోర్టు కావచ్చు ఒక్కో కేసును కొట్టేస్తోంది. జగన్ పై వేసిన చార్జిషీట్లు కూడా విచారణలో దాదాపు వీగిపోతున్నాయి. అక్రమాస్తుల సంపాదనకు సంబంధించి అప్పటి మంత్రులకు సంబంధం లేదని ఇప్పటికే ప్రభుత్వమే తేల్చేసింది. కేసులు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులకు కూడా సంబంధాలు లేవని, విధి నిర్వహణలో అధికారులు నిబంధనలను అనుసరించే నిర్ణయాలు తీసుకున్నారంటూ కోర్టులు వారిపై నమోదైన కేసులను కొట్టేస్తున్నాయి.

దురుద్దేశ్యంతోనే చార్జిషీటు

ఇటువంటి నేపధ్యంలో జగన్ పై నమోదైన కేసులు కూడా నిలిచేవి కావంటూ అందరూ అనుకుంటున్నారు. న్యాయవాదులు, రాజకీయ నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అటువంటి సమయంలో హటాత్తుగా వైఎస్ భారతిపై ఇడి చార్జిషీట్ వేయటంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు. అందులోనూ రాజ్యసభ డిప్యుటి ఛైర్మన్ ఎన్నికను వైసిపి బహిష్కరించిన నేపధ్యంలో చార్జిషీటు వేయటం గమనార్హం. సరే, చార్జిషీటు వేసినంత మాత్రాన ఏమవుతుందన్నది వేరే సంగతి. ఇప్పటికైతే జగన్ ప్రత్యర్ధులకు మంచి అస్త్రాన్ని అందించినట్లే కదా ? అదే విషయమై వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, వైఎస్ భారతిపై ఏడేళ్ళ క్రిందటి కేసులో చార్జిషీటు వేయటం రాజకీయ దురుద్దేశ్యంతోనే జరిగిందంటూ మండిపడ్డారు. ఏ కేసులో కూడా జగన్ ను ఏమీ చేయలేక వైఎస్ భారతిని పిక్చర్లోకి తెస్తున్నట్లు పద్మ ధ్వజమెత్తారు.

Related Images: