విశ్వరూపం2 మూవీ రివ్యూ..!

విశ్వరూపం2 మూవీ రివ్యూ..!

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో నటించి రూపొందిన చిత్రం ‘విశ్వరూపం’. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘విశ్వరూపం 2’. ఆస్కార్‌ ఫిలిం (ప్రై) లిమిటెడ్‌ వి.రవిచంద్రన్‌ సమర్పణలో రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రూపొందిన చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విశ్వరూపం మాదిరిగానే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా అని తెలుసుకోవాలంటే విశ్వరూపం కథ ఏంటో తెలుసుకోవాల్సిందే.

విశ్వరూపం2 కథ

న్యూయార్క్ నగరంపై భయకంకరమైన ఉగ్రదాడిని చేయడంలో విఫలమైన ఓమర్ ఖురేషి (రాహుల్ బోస్), సలీం (జైదీప్ అహ్లావత్) మరో దారుణమైన ఎటాక్‌కు ప్లాన్ చేస్తారు. ఓమర్ ఉగ్రదాడిని చిత్తు చేసేందుకు భారత జవాను, గూఢచారి మేజర్ విసామ్ ఆహ్మద్ కశ్మీరి (కమల్ హాసన్), న్యూక్లియర్ ఆంకాలజిస్టు, భార్య నిరుపమ (పూజా కుమార్), సహచర ఉద్యోగి అస్మిత సుబ్రమణ్యం (అండ్రియా జెర్మియా), కల్నల్ జగన్నాథ్ (శేఖర్ కపూర్) ఓ మిషన్‌కు సిద్దమవుతారు. ఈ మిషన్‌లో అస్మిత ప్రాణ త్యాగం చేస్తుంది.

విశ్వరూపం2లో ట్విస్టులు

ఓమర్, సలీం ఉగ్రదాడి వ్యూహరచనను విసామ్ ఎలా చిత్తు చేశారు? ఈ మిషన్‌లో విసామ్ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? దేశం కోసం ఏ పరిస్థితుల్లో అస్మిత ప్రాణ త్యాగం చేసింది? ఓమర్ ఖురేషి భార్య, పిల్లల కోసం విసామ్ ఏం చేశాడు? చివరకు ఓమర్‌, సలీంను ఎలా మట్టుపెట్టాడు? అనే ప్రశ్నలకు సమాధానమే విశ్వరూపం2 కథ.

ఫస్టాఫ్ ఎనాలిసిస్

2013లో విడుదలైన విశ్వరూపం చిత్రం ఎక్కడైతే ముగిసిందో విశ్వరూపం2 కథ అక్కడ నుంచి మొదలవుతుంది. ఓమర్ బంకులపై సంకీర్ణ దళాల దాడులను చేయడం తొలిభాగంలో ప్రధాన అంశంగా కనపడుతుంది. తొలిభాగంలో వ్యూహ రచన సాగదీయడంతో ప్రేక్షకులకు సహనాన్ని పరీక్షించినట్టు ఉంటుంది. అద్బుతమైన థ్రిల్లింగ్ ఉంటుందనే ఆశించిన ప్రేక్షకులకు తొలిభాగం నిరాశనే కలిగిస్తుంది. తొలిభాగంలో గొప్పగా చెప్పుకొనే సన్నివేశాలు కానీ, కథ గానీ లేకపోవడం పెద్ద మైనస్.

సెకండాఫ్ ఎనాలిసిస్

ప్రధానంగా కథలో కొత్తగా మలుపు లేకపోవడంతో సెకండాఫ్‌ కూడా చాలా ఫ్లాట్‌గా సాగిపోతుంది. సెంటిమెంట్ కోసం విసామ్ తల్లి ఎపిసోడ్‌ కూడా పెద్దగా పండలేకపోయింది. క్లైమాక్స్‌కు ముందు అస్మిత మర్డర్ నుంచి కథ కాస్త ఆసక్తిని రేపుతుంది. కానీ క్లైమాక్స్ కూడా గొప్పగా అనిపించదు. ఓమర్, సలీంను అంతం చేయడంతో కథకు ముగింపు కార్డు పడుతుంది. విశ్వరూపం1ను పోల్చితే ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచిందనే చెప్పవచ్చు.

డైరెక్టర్‌గా కమల్ హాసన్ పనితీరు

కమల్ హాసన్ దర్శకుడిగా కథను ఆసక్తిగా ముందుకు నడిపించడంలో విఫలమయ్యాడనే చెప్పవచ్చు. తొలిభాగంలో సుదీర్ఘంగా సాగే సీన్లు కథ గమనానికి అడ్డం పడ్డాయనే చెప్పవచ్చు. కాకపోతే కొన్ని సీన్లలో టేకింగ్ అదిరిపోయింది. విమాన దాడుల చిత్రీకరణ, సముద్రం లోపల యాక్షన్ సీన్లు కొంత ఆసక్తిగా చిత్రీకరించాడు.

కమల్ హాసన్ నటన

విసామ్‌గా కమల్ నటన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే మోశాడు. కీలక సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పండించాడు. పేలవమైన సీన్ల కారణంగా కమల్ నటన బయటకు కనిపించలేకపోయింది. తల్లి, భార్య, తన సహచర ఉద్యోగి మధ్య ఉన్న బంధాల మధ్య ఎమోషన్‌ను పండించడానికి ప్రయత్నం చేశాడు.

అండ్రియా, పూజాకుమార్ యాక్టింగ్

విసామ్ భార్య నిరుపమగా పూజా కుమార్ నటించారు. సముద్రంలో చోటుచేసుకొనే ఆటుపోట్లపై అధ్యయనం చేసే పరిశోధకురాలిగా కనిపించారు. ఒకట్రెండు సీన్లలో మాత్రమే ఆకట్టుకునే విధంగా ఆమె నటన ఉంది. విసామ్ సహచర ఉద్యోగిగా ఆండ్రియా నటించింది. దేశం కోసం అమరులయ్యే పాత్రలో కనిపించింది. పాత్ర పరిధి తక్కువగా ఉండటంతో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

మిగితా పాత్రల్లో

ఇంటర్నేషనల్ టెర్రరిస్టుగా ఓమర్ పాత్రలో రాహుల్ బోస్, ఆయన నమ్మిన బంటుగా సలీం మిలటరీ అధికారిగా జైదీప్ అహ్లావత్ నటించారు. కథలో దమ్ము లేకపోవడంతో ఈ చిత్రంలో వీరి నటన ఆకట్టుకోలేకపోయింది. సైనిక ఉన్నతాధికారి, విసామ్ గురువుగా శేఖర్ కపూర్ నటించాడు. శేఖర్ కపూర్ పాత్రలో వైవిధ్యం లేకపోవడంతో అలరించలేకపోయారు.

జిబ్రాన్ సంగీతం

విశ్వరూపం2 సినిమాకు అతిపెద్ద మైనస్ జిబ్రాన్ మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ చాలా వీక్. కథలో స్కోప్ లేకపోవడం వల్ల వినసొంపైన పాటలు కూడా అందించలేకపోయారనే ఫీలింగ్ కలుగుతుంది.

Related Images: