పరువునష్టం కేసు గెలిచిన క్రిస్‌ గేల్

పరువునష్టం కేసు గెలిచిన క్రిస్‌ గేల్

పరువునష్టం కేసులో భాగంగా వెస్టిండీస్‌ ఆటగాడు క్రిస్ గేల్‌కు దాదాపు రూ.కోటిన్నర (3,00,000 ఆస్ట్రేలియా డాలర్లు) చెల్లించాలని ఆస్ట్రేలియా కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. 2015వరల్డ్ కప్‌ సమయంలో చోటు చేసుకున్న ఘటనపై 2016లో ఫైర్ ఫాక్స్‌ అనే మీడియా సంస్థ ప్రచురించిన కథనాలను ఖండిస్తూ గేల్‌ పరువునష్టం దావా వేశాడు. దీనిపై విచారించిన న్యూ సౌత్‌ వేల్స్‌ సుప్రీం కోర్టు జడ్జి లూసి మెకల్లమ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు.

2016 జనవరిలో ఫైర్‌ ఫాక్స్‌ సంస్థ గేల్‌కు వ్యతిరేకంగా చాలా కథనాలు ప్రచురించింది. వరల్డ్ కప్‌ ట్రైనింగ్‌ సెషన్‌ సందర్భంగా వెస్టిండీస్ డ్రెస్సింగ్‌ రూమ్‌లో మసాజ్‌ చేసే మహిళతో గేల్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంది.

గేల్‌పై ప్రచురించిన కథనాలు సరైనవే అనడానికి ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో, అవి తప్పుడు వార్తలు అని గతేడాది అక్టొబరులోనే కోర్టు నిర్ణయానికి వచ్చింది. తాజాగా గేల్‌ ప్రవేశపెట్టిన సాక్ష్యంతో కోర్టు ఏకీభవించి, అతనికి అనుకూలంగా తీర్పు చెప్పింది. ఫైర్‌ఫాక్స్‌ సంస్థ గేల్‌పై కక్షతోనే ఆ కథనాలు ప్రచురించిందని కోర్టు పేర్కొంది.

‘గేల్‌ ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పు చెప్పింది. అతడికి ఆస్ట్రేలియాలో ఆడటం అంటే చాలా ఇష్టం. బిగ్‌ బాష్‌ లీగ్‌లోనూ ఆడాలనుకుంటున్నాడు’ అని గేల్‌ ప్రతినిధి గ్రాంట్‌ వాండన్‌బర్గ్‌ తీర్పు అనంతరం అన్నారు.

Related Images: