‘నాలుగున్నరేళ్లు కష్టపడ్డాను.. నా కూలి నాకు ఇచ్చేయండి

‘నాలుగున్నరేళ్లు కష్టపడ్డాను.. నా కూలి నాకు ఇచ్చేయండి

ఈ నాలుగున్నరేళ్లలో తాను చేయాల్సింది చేశానని, ఇక రానున్నది ప్రజల వంతేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది. ”నా కష్టానికి కూలి ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలదే” అని చంద్రబాబు అన్నారు.

”ఇప్పుడిప్పుడే మెయిన్‌ రోడ్‌పైకి వచ్చాం. దీన్ని ఇలా కొనసాగించేందుకు మీరంతా (ప్రజలంతా) నాకు తోడుగా నిలవాలి. వచ్చే ఎన్నికల్లో నా వెనుక మీరుంటే 2029 కంటే ముందే ఏపీని ధనిక రాష్ట్రంగా మారుస్తా. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచుతా” అని ఆయన హామీ ఇచ్చారు.

”వచ్చే ఎన్నికల్లో టీడీపీ మళ్లీ రాకపోతే రాష్ట్రం దెబ్బ తింటుంది. మనం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇంకా ఎన్నో ఆలోచనలు చేస్తున్నాం. ఇవన్నీ సాఫీగా కొనసాగాలంటే తిరిగి మనమే రావాలి. ఈ మాట ప్రతి చోటా ప్రజలు అంటున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో అనేక సమస్యలు పరిష్కరించాం. గ్రామాలు, వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాం. సిమెంటు రోడ్లు వేశాం. ఎల్‌ఈడీ లైట్లు పెడుతున్నాం. మరుగు దొడ్లు కడుతున్నాం. ఆపదలో అందరికీ అండగా ఉంటున్నాం. ఎన్నో అవార్డులు సాధించాం. కేంద్రం సహకారం లేకపోయినా ఎన్నో పనులు చేశాం. అదే కేంద్రం తోడ్పాటు ఉంటే ఇంకెన్నో చేసేవాళ్లం. ఈ విషయాలు జనంలోకి తీసుకెళ్లాలి. ఏమీ చేయని కేసీఆర్‌ (తెలంగాణ సీఎం) అన్ని సీట్లలో గెలిస్తే ఎన్నో చేసిన టీడీపీ ఎన్ని సీట్లలో గెలవాలి? వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పాతిక ఎంపీ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా మనం కసితో పనిచేయాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపైనా.. అన్యాయం చేసిన వారిపైనా పోరాడుతున్న టీడీపీకి అన్ని వర్గాలూ అండగా నిలవాలి. కుట్రలు చేస్తున్న ప్రతిపక్షాన్ని పక్కన పెట్టి మంచిని ఆశీర్వదించాలి” అని ఆయన ప్రజలను కోరారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు సాధించిన ప్రగతిని, ఆయా గ్రామాల్లో భవిష్యత్‌ అవసరాలను గుర్తించేందుకు ఉద్దేశించిన ఆరో విడత జన్మభూమి కార్యక్రమానికి చంద్రబాబు బుధవారం శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో చీలేపల్లె పంచాయతీ పరిధిలోని వడ్డిపల్లెలో ఏర్పాటు చేసిన గ్రామసభను ప్రారంభించారు.

”కులాలు, మతాలు అన్నం పెట్టవు. రైతులంతా ఓ కులం, అర్హులంతా ఓ కులం, దాతలంతా ఓ కులంగా భావించాం. వచ్చే ఎన్నికల్లో ఓటేస్తారని భావించిన వారితో పాటు ఓటేయని వారికి కూడా న్యాయం చేశాం” అని సీఎం చెప్పారు. మళ్లీ అవకాశమిస్తే మీ జీవితాల్లో మరింత వెలుగు తెస్తానని హామీ ఇచ్చారు.

Related Images: