శిక్షణ ఇచ్చి మరీ.. ఎన్టీఆర్‌గా దించుతున్నా: వర్మ

శిక్షణ ఇచ్చి మరీ.. ఎన్టీఆర్‌గా దించుతున్నా: వర్మ

సంచలన దర్శకుడిగా పేరొందిన రామ్‌గోపాల్ వర్మ.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీస్తానని చెప్పి ప్రస్తుతం సెంటర్ అఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఓ వైపు బాలకృష్ణ తన తండ్రి బయోపిక్ రూపొందిస్తుండగా.. వర్మ కూడా తనదైన కోణంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రూపొందించే పనిలో పడ్డారు. తాను తీయబోయే బయోపిక్ లోనే నిజాలు దాగి ఉన్నాయని తెలిపిన వర్మ.. ఇటీవల ఈ సినిమా నుంచి ”వెన్నుపోటు, ఎందుకు?” అనే రెండు పాటలు రిలీజ్ చేసి పలు వివాదాలకు తెరలేపారు. ఇదిలా ఉండగానే నిన్న(జనవరి 18) ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన మళ్లీ పుడతారని వర్మ ట్వీట్ చేసి మరో సంచలనానికి తెర తీశారు. చెప్పినట్లుగానే తన చిత్రంలోని ఎన్టీఆర్ లుక్‌తో కూడిన వీడియో రిలీజ్ చేశాడు.

ఈ వీడియోలో కనిపిస్తున్న నటుడు అచ్చం ఎన్టీఆర్ లాగే ఉండటంతో ఆశ్చర్యపోయారు ప్రేక్షకులు. దివంగత ఎన్ఠీఆర్ మళ్లీ దిగొచ్చారా.. ఏంటి? అని అవాక్కయ్యారు అంతా. దీంతో ఈ నటుడెవరు? ఇంతవరకూ ఏ సినిమాలో కనిపించలేదే! అసలు వర్మ ఇతన్ని ఎక్కనుంచి పట్టుకొచ్చాడు అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అయితే వీటిపై ఓ చిన్న క్లారిటీ ఇస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశాడు రామ్‌గోపాల్ వర్మ.

”లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్‌గా కనిపించిన ఆ వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ థియేటర్ యాక్టర్. అతనికి నేను.. ఎన్టీఆర్‌గా ఎలా నటించాలో కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చాను. ఎన్టీఆర్ వైఖరి, బాడీ లాంగ్వేజ్, ప్రసంగాల నమూనా లాంటి వాటిలో అతనికి బాగా రాటుదేల్చి ఎన్టీఆర్‌గా దించుతున్నా” అని ట్వీట్‌లో పేర్కొన్నారు వర్మ. ఈ చిత్రానికి వైసీపీ నేత రాకేశ్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఎం.ఎం కీరవాణి సోదరుడు కల్యాణి మాలిక్‌ సంగీతం అందిస్తున్నారు. లక్ష్మీపార్వతిగా కన్నడ నటి యజ్ఞాశెట్టి, చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నాడు.

Related Images: