టీడీపీలోకి వంగవీటి రాధాకు స్వాగతం

టీడీపీలోకి వంగవీటి రాధాకు స్వాగతం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఆ లేఖలు ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. అభిమానులు, అనుచరులతో భేటీ అయి రెండు రోజుల్లో ఏ పార్టీలో చేరనున్నారో చెబుతానని అన్నారు. దీంతో ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది.

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలోకి వెళ్తారా అనే చర్చ సాగుతోంది. కానీ అంతలోనే మరో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఆయన తెలుగుదేశం పార్టీలోకి రానున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. వంగవీటి రాధా టీడీపీలోకి వస్తే అది అనూహ్యమే అంటున్నారు. అయితే, టీడీపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ఆ పార్టీ కండువా కప్పుకోవాలని చూస్తున్నారా లేక వీరే ఆహ్వానిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

టీడీపీలోకి వస్తే ఆహ్వానిస్తాం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విధానాలు, తీరు నచ్చకనే చాలామంది నేతలు వైసీపీని వీడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. కానీ ఆయన తమ పార్టీలోకి వస్తున్నట్లుగా సమాచారం లేదని చెప్పారు. వంగవీటి, దేవినేని వర్గాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.

టీడీపీకి అభ్యర్థి.. అక్కడే చిక్కు

విజయవాడ సెంట్రల్ సీటు విషయంలోనే వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. టీడీపీలో ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి బోండా ఉమామహేశ్వర రావు ఉన్నారు. ఈ పార్టీలో చేరితే ఆయన కోరుకున్న టిక్కెట్ వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. అలాంటప్పుడు ఈ పార్టీలోకి ఎలా వస్తారనే చర్చ సాగుతోంది. లేదంటే కీలక నేత వస్తున్నందున బోండా ఉమాకు నచ్చచెప్పే అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి.

రాష్ట్రవ్యాప్తంగా ఆయన సేవలు వినియోగించుకునే అవకాశం

అలాకాకుండా, ఆయన టీడీపీలో చేరితే ఎమ్మెల్సీ పదవి హామీపై వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సేవలను వినియోగించుకోవాలని చూస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడి టీడీపీలో చేరితే మరికొంతమంది ఆ దారిలో వస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇతర పార్టీల నుంచి హామీ, వైసీపీ నుంచి సెంట్రల్ టిక్కెట్ పైన జగన్ నుంచి హామీ కోసమే ఆయన రెండు రోజుల గడువు పెట్టి ఉంటారని అంటున్నారు.