సూర్యను పెళ్లి చేసుకోవాలనుంది: ‘నోటా’ భామ

సూర్యను పెళ్లి చేసుకోవాలనుంది: ‘నోటా’ భామ

తమిళ కథానాయకుడు సూర్యను వివాహం చేసుకోవాలనుందని నటి యషికా ఆనంద్‌ అన్నారు. విజయ్‌ దేవరకొండ ‘నోటా’ సినిమాలో యషిక కీలక పాత్ర పోషించారు. ఆమె తాజాగా సోషల్‌మీడియా వేదికగా కాసేపు అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ ‘మీరు ఎవర్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. దీనికి యషిక ‘నటుడు సూర్యను వివాహం చేసుకోవాలనుంద’ని సరదాగా సమాధానం ఇచ్చారు.

అయితే యషిక కామెంట్‌ సూర్య అభిమానుల్ని ఆగ్రహానికి గురి చేసింది. ‘ఇప్పటికే పెళ్లయిన ఆయన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా?, ఇద్దరు పిల్లలున్న సూర్యను ఎలా వివాహం చేసుకుంటావు?..’ అంటూ మండిపడుతూ కామెంట్లు చేశారు. దీంతో యషిక సూర్యను ఉద్దేశించి చేసిన పోస్ట్‌ను డిలీట్‌ చేశారు.

ఇలా యషిక సోషల్‌మీడియాలో విమర్శలు ఎదుర్కోవడం ఇది తొలిసారి కాదు. ఇటీవల ఆమె అభిమానులకు ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరికి కరెన్సీ నోట్లపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. దీన్ని నెటిజన్లు తప్పుపట్టారు. కేవలం రిజర్వు బ్యాంకు గవర్నర్‌ మాత్రమే కరెన్సీపై సంతకం చేయాలని, ఆమె సంతకం చేయడం సరైన పని కాదని అన్నారు.

Related Images: