తొలి ప్రయాణంలోనే నిలిచిపోయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్

తొలి ప్రయాణంలోనే నిలిచిపోయిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్

దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరుగాంచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. శుక్రవారం ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ రైలుకు అప్పుడే కష్టాలు వచ్చాయి. శనివారం ఉదయం ఈ రైలు కొన్ని సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో అంటే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని తుండ్లా జంక్షన్‌కు 15 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయింది. శనివారం ఉదయం ఈ రైలు నుంచి ఒక విధమైన శబ్దం వచ్చిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత రైలు బ్రేకులు జామ్ అయినట్లు వెల్లడించారు.మరో నాలుగు కోచ్‌లలో కూడా సమస్యలు తలెత్తడంతో లోకో పైలట్లు బలవంతంగా రైలును నిలిపివేశారు.

ఇదిలా ఉంటే రైలు పట్టాలపై ఎదురొచ్చిన గోవును రైలు ఢీకొనడంతోనే ఈ పరిస్థితి నెలకొని ఉండొచ్చని ఓ అధికారి తెలిపారు.రైలు నిలిచిపోవడంతో ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, అధికారులు, జర్నలిస్టులను మరో రైలులోకి మార్చి తరలించారు. వారణాసిలో ప్రారంభమైన ఈ రైలు ఢిల్లీకి తిరిగి వస్తుండగా సాంకేతికలోపంతో నిలిచిపోయింది. ఆదివారం నుంచి అధికారికంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం కానుంది. ఇక సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అప్పటికే రైలులో ప్రయాణిస్తున్న ఇంజనీర్లు వెంటనే సమస్యను గుర్తించే పనిలో పడ్డారు. ఉత్తర భారత రైల్వేకు చెందిన ఛీఫ్ మెకానికల్ ఇంజినీర్‌ను సంప్రదించగా మరమత్తులు చేసి రైలును తిరిగి స్టార్ట్ చేశారు.

కొత్తలోనే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరమత్తులు రావడంతో ముందుగా షెడ్‌కు తరలించి రైలును మరోసారి పరీక్షిస్తామని అధికారులు తెలిపారు. న్యూఢిల్లీలో కాకపోయినప్పటికీ దగ్గరలో ఉన్న షెడ్డుకు తరలిస్తామని వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ నుంచి ఉదయం 11:19 గంటలకు పట్టాలపై పరుగులు తీసింది వందేభారత్ ఎక్స్‌ప్రెస్. వారణాసికి తన తొలి ప్రయాణింలో గంటకు 130 కిలోమీటర్ల అత్యధిక వేగంతో ఈ రైలు పరుగులు పెట్టింది. ఈ రైలులో ప్రయాణికులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయని రైలులో ప్రయాణించిన రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీ నుంచి వారణాసికి ఈ రైలు తీసుకునే సమయం కేవలం 8 గంటలు మాత్రమే. అంతకుముందు సాధారణ రైలులో అయితే ఆ సమయం 13-14 గంటలు పట్టేది.

Related Images: